Leading News Portal in Telugu

Pakistan: పాకిస్థాన్‌కు చైనా షాక్.. ఆ ప్రతిపాదనను తిరస్కరించిన డ్రాగన్‌


Pakistan: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు చైనా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ రాజకీయ అస్థిరత, భద్రత కారణంగా కొత్త బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులను చైనా తిరస్కరించింది. నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం.. నూతన బెల్ట్ అండ్‌ రోడ్ ప్రాజెక్టులను తిరస్కరించడానికి పాకిస్తాన్ భద్రతా పరిస్థితి, రాజకీయ అస్థిరత కారణమని చైనా పేర్కొంది. చైనా నుంచి పెట్టుబడులు పెట్టాలని పాకిస్థాన్ విజ్ఞప్తి చేసిందనే విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌ విజ్ఞప్తిని చైనా తోసిపుచ్చింది.

చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) కింద ఇంధనం, వాతావరణ మార్పులు, విద్యుత్ ప్రసార మార్గాలు, పర్యాటక రంగానికి సంబంధించిన మరిన్ని ప్రాజెక్టులను జోడించాలన్న పాకిస్తాన్ విజ్ఞప్తిని చైనా తిరస్కరించింది. చైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్‌కు కేంద్రమైన గ్వాదర్‌లోని దక్షిణ ఓడరేవును కరాచీ నుంచి నేషనల్ పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు 500 కిలోమీటర్ల ట్రాన్స్‌మిషన్ లైన్‌ను నిర్మించాలన్న పాకిస్థాన్ ప్రతిపాదనను చైనా తిరస్కరించిందని నివేదిక పేర్కొంది.

ఇది కాకుండా, గ్వాదర్‌లో 300 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌పై తన అభ్యంతరాన్ని విరమించుకోవాలని చైనా పాకిస్తాన్‌ను బలవంతం చేసింది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ జాయింట్ కోఆపరేషన్ కమిటీ (JCC) 11వ సమావేశం గత సంవత్సరం అక్టోబర్‌లో జరగగా.. ఈ సంవత్సరం జూలైలో సంతకం చేయబడింది. నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం, స్థానిక మీడియాలో వచ్చిన నివేదికలను అధికారులు ధృవీకరించారు. నీటి వనరుల నిర్వహణ, వాతావరణ మార్పులు, పర్యాటకం వంటి కొత్త సహకార రంగాలను చేర్చడానికి చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పరిధిని విస్తరించడానికి చైనా, పాకిస్తాన్ కట్టుబడి ఉన్నాయని పాకిస్తాన్ ప్రణాళిక, అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది.