Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి వెస్ట్రన్ దేశాలపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ‘‘రష్యా కొత్త ప్రపంచాన్ని నిర్మించే పనిలో ఉంది’’ అని గురువారం అన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి వెస్ట్రన్ దేశాలే కారణమని నిందించారు. ప్రపంచ ఆధిపత్యం కోసం పశ్చిమ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆరోపించారు. పాశ్యాత్య దేశాలకు ఎప్పుడూ ఓ శతృవు కావాలని ఎద్దేవా చేశారు. వాల్దాయ్ పొలిటికల్ ఫోరమ్ సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్ వివాదం ప్రాదేశికమైంది కాదని, ఇతరుల భూభాగాలు జయించాలని రష్యాకు ఎలాంటి ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. వెస్ట్రన్ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ప్రారంభించిన యుద్ధం పదేళ్లుగా కొనసాగుతోందని, దీనిని ఆపడానికి రష్యా ప్రత్యేక సైనిక చర్య చేపట్టాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
రష్యా 2014లో ఉక్రెయిన్ భూభాగమైన క్రిమియా ద్వీపాన్ని తనలో కలిపేసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధంలో ఉక్రెయిన్‌కి చెందిన నాలుగు భూభాగాలైన జపొరిజ్జియా, డొనెట్స్క్, లూహాన్స్క్, ఖేర్సన్ లను ఆక్రమించుకుంది. ఈ ప్రాంతాల్లో రష్యన్లు ఎక్కువ మంది నివసిస్తున్నారు. వీరు గత కొంత కాలంగా ఉక్రెయిన్ నుంచి రష్యాలో కలిసేందుకు పోరాడుతున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత రష్యాపై అనేక దేశాలు, ముఖ్యంగా అమెరికాతో పాటు పలు యూరోపియన్ దేశాలు, అమెరికా మిత్ర రాజ్యాలు ఆంక్షలు విధించాయి. అయినా కూడా పుతిన్ వెనక్కి తగ్గకుండా వెస్ట్రన్ దేశాల తీరును ప్రశ్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రష్యా కొత్తగా చైనా, దక్షిణ కొరియా, ఇరాన్ వంటి దేశాలతో బంధాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఇటీవల కాలంలో చైనాతో ఎక్కువగా సంబంధాలు పెట్టుకుంటోంది. ఇటీవల ఉత్తర కొరియా అధినేత కిమ్ తో పుతిన్ కీలక చర్చలు జరిపారు. ఈ పరిణామాలు ముఖ్యంగా చైనాతో రష్యా బంధం అమెరికాకు, వెస్ట్రన్ దేశాలకు గుబులు పుట్టిస్తోంది.