Nobel Peace Prize: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్‌కి చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గేస్ మొహమ్మదీ గెలుచుకున్నారు.అయితే ఆమె ప్రస్తుతం టెహ్రాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపుగా 30కి పైగా కేసులను అక్కడి మత ఛాందసవాద ప్రభుత్వం ఆమెపై మోపింది. నర్గీస్ ఒక్కరే కాదు, ఈమెతో కలిపి ఐదుగురు జైలులో ఉన్న సమయంలోనే వారికి నోబెల్ శాంతి బహుమతులు వచ్చాయి.
నర్గీస్ మొహమ్మదీ (2023):
ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త అయిన నర్గీస్ మొహమ్మదీ మహిళలపై అణిచివేతను ప్రశ్నించింది. జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడారు. హిజాబ్, మరణశిక్షలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయితే ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని నర్గీస్ ని అక్కడి ప్రభుత్వం జైలులో నిర్భంధించింది. ప్రస్తుతం ఆమె 30కి పైగా కేసులు, కొరడా దెబ్బల శిక్షలను అనుభవిస్తున్నారు. గతేడాది ఇరాన్ మహిళ మహ్సా అమిని హత్యకు నిరసనగా జైలు నుంచే ఆమె పోరాటం కొనసాగించారు.
కార్ల్ వాన్ ఒసిట్జ్కీ, జర్మనీ(1935):
జర్నలిస్ట్, శాంతికాముకుడైన కార్ల్ వాన్ ఒస్సిట్జ్కీ 1935లో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు. హిట్లర్ సమయంలో నాజీ నిర్బంధ శిబిరంలో ఖైదీగా ఉన్నాడు. హిట్లర్ అన్యాయాలను ప్రశ్నించాడు. జర్మనీ పౌరులెవరూ కూడా ఏ విభాగంలో నోబెల్ బహుమతి స్వీకరించకుండా నిషేధించారు. ఒస్సిట్జ్కీ 1938లో జైలులోనే మరణించారు.
ఆంగ్ సాన్ సూకీ, మయన్మార్(1991):
మయన్మార్ ప్రధానిగా పనిచేసి ఆంగ్ సాంగ్ సూకీ 1991లో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. ఆ సమయంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ఆమెను అక్కడి మిలిటరీ గృహనిర్భంధంలో ఉంచింది. ఈ అవార్డును సూకీ భర్త, కుమారులు తీసుకున్నారు. ప్రజాస్వామ్యం, మానవహక్కుల కోసం ఆమె అహింసాయుత పోరాటం చేశారు. ఆ సమయంలో మయన్మార్ విడిచి అవార్డు తీసుకోవడానికి ఓస్లోకి వెళితే మళ్లీ తిరిగి రానివ్వరని భయపడ్డారు.
ఫిబ్రవరి 2021లో సూకీ ప్రభుత్వాన్ని పదవి నుంచి దించేసి మరోసారి మిలిటరీ జుంటా మయన్మార్ పాలనను హస్తగతం చేసుకుంది. 2022లో ఆమెకు మొత్తం 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి జుంటా ప్రభుత్వం. ఆ తరువాత జుంటా చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్ పాక్షికంగా శిక్షను తగ్గించాడు.
లియు జియాబో, చైనా(2010):
చైనా అసమ్మతవాది లియు జియాబో 2010లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. ఆ సమయంలో ఆయన జైలులో ఉన్నారు. విద్రోహానికి పాల్పడిన ఆరోపణలపై అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆయనకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చైనాలో మానవహక్కుల కోసం సుదీర్ఘంగా పోరాడారు. ఈ బహుమతి గెలుచుకున్న తర్వాత లియు భార్యన లియు జియాను కూడా గృహనిర్భందంలోకి తీసుకున్నారు. అతని ముగ్గురు కుమారులు చైనా వదిలివెళ్లకుండా నిర్భందించారు. 2017 క్యాన్సర్ తోఆయన కన్నుమూశారు. జైలులోనే కన్నుమూసిన రెండో నోబెల్ గ్రహీత అయ్యారు.
అలెస్ బిలియాట్స్కీ, బెలారస్(2022):
బెలారస్ దేశానికి చెందిన మానవహక్కుల ప్రచారకర్త అలెస్ బిలియాట్స్కీకి అక్కడి ప్రభుత్వం 2021లో జైలు శిక్ష విధించింది. శాంతి బహుమతి వచ్చే సమయానికి ఆయన జైలులోనే ఉన్నారు. యుద్ధనేరాలు, హక్కుల దుర్వినియోగంపై చేసిన కృషికి గానూ ఆయనకు అవార్డు వచ్చింది. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో పాలనపై నిరసన వ్యక్తం చేశాడు.