Donald Trump: అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయిల్ పై హమాస్ తీవ్రవాదులు భారీ దాడికి తెగబడ్డారు. 5000 రాకెట్లతో గాజా నుంచి ఇజ్రాయిల్ పైకి దాడి చేశారు. ఈ దాడిలో 300 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. ఊహించని దాడితో ఇజ్రాయిల్ ఉక్కిరిబిక్కిరి అయింది. ఇజ్రాయిల్ సైన్యం గాజా స్ట్రిప్ పై భీకరంగా దాడులు చేస్తోంది. చుట్టు పక్కల దేశాల్లోని మిలిటెంట్ సంస్థలు కూడా ఇజ్రాయిల్ పై దాడులకు చేస్తున్నాయి. ఈ చర్యలతో మరోసారి మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు తెలెత్తాయి.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ పై హమాస్ దాడికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కారణమంటూ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇజ్రాయిల్ కి హక్కు ఉందని ట్రంప్ అన్నారు. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వస్తున్న నివేదికల ప్రకారం.. ఈ దాడులకు అమెరికన్లు పన్నుల రూపంలో చెల్లించిన డాలర్లు నిధుల రూపంలో సమకూర్చబడ్డాయని ఆరోపించారు.
ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఇరాన్ కి గత నెలలో ఖైదీల విడుదల కోసం చెల్లించిన 6 బిలియన్ డాలర్లు హమాస్ కి నిధుల రూపంలో వెళ్లాయని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ట్రంప్ మద్దతు ఇచ్చారు. దీనిపై వైట్ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ ఆండ్రూ బేట్స్ స్పందించారు. ఇజ్రాయిల్ రక్షణకు రెండు పార్టీలు పూర్తిగా మద్దతు ఇవ్వాల్సిన తరుణంలో అబద్దాలు ఆడుతున్నరని మండిపడ్డారు. ఈ డబ్బులు ఆహారం, ఔషధాల వంటి మానవతా సాయం మాత్రమే ఉపయోగపడుతుందని బేట్స్ తెలిపారు.
మరోవైపు హమాస్ తీవ్రవాదులకు కోటగా ఉన్న హమాస్ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ ఆ దేశ సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హమాస్ దారుణమైన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన అన్నారు. గాజాలోని హమాస్ ని దెబ్బతీయడానికి ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తోంది.