
Israel: ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిగిన దాడికి మరికొన్ని ఇస్లామిక్ మిలిటెంటు గ్రూపులు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయిల్ లోని వివాదాస్పద ప్రాంతాలపైకి దాడులు చేసింది. ఇజ్రాయిల్ సరిహద్దు దేశం లెబనాన్ నుంచి ఈ దాడులు జరిగాయి. ఇజ్రాయిల్ సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలపై ఆర్టిలరీ షెల్స్, గైడెడ్ మిస్సైళ్లను పేల్చినట్లు లెబనాల్ లో ఉన్న హమాస్ మద్దతుదారు హిజ్బుల్లా ఆదివారం తెలిపింది.
ఈ దాడిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయిల్ కూడా లెబనాన్ పై ప్రతిదాడులు చేసినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. ఆక్రమిత లెబానీస్ షెబా ఫామ్ లోని ఇజ్రాయిల్ మూడు స్థావరాలపై దాడి చేసింది. హమాస్ శనివారం ఇజ్రాయిల్‌పై జరిపిన దాడికి సంఘీభావంగా హిజ్బుల్లా ఈ దాడికి పాల్పడింది.
Read Also: Afghanistan Earthquake: ఆఫ్ఘాన్ భూకంపంలో 1000కి పైగా మృతుల సంఖ్య
శనివారం పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై భీకరదాడి చేశారు. కేవలం 20 నిమిషాల్లోనే గాజా నుంచి ఇజ్రాయిల్ పైకి 5000 రాకెట్లను ప్రయోగించారు. 14 చోట్ల నుంచి సరిహద్దు దాటిని తీవ్రవాదులు ఇజ్రాయిల్ సరిహద్దు పట్టణాలు, నగరాలపై విరుచుకుపడ్డారు. ఇజ్రాయిలీలను కాల్చుతూ చంపేశారు. చాలా మందిని బందీలుగా పట్టుకుని గాజా ప్రాంతానికి తీసుకెళ్లారు.
తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ ప్రకటించారు. హమాస్ నరకానికి ద్వారాలు తెరిచిందని ఆ దేశ డిఫెన్స్ చీఫ్ హెచ్చరించారు. గాజాను సర్వనాశనం చేస్తామని బెంజిమెన్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్ చేసిన దాడిలో 300 మంది ఇజ్రాయిల్ పౌరులు చనిపోగా.. గాజాపై ఇజ్రాయిల్ వైమానిక దళం దాడులు చేస్తోంది. గాజాలో కూడా 250కి పైగా మరణించినట్లు తెలుస్తోంది.