2016 Pathankot attack handler Shahid Latif Dies in Pakistan: 2016 పఠాన్‌కోట్ దాడి ప్రధాన సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్ (41) మృతి చెందాడు. మంగళవారం పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లోని మసీదులో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చి చంపారు. లతీఫ్ సమాచారం గురించి తెలిసిన షూటర్లు అతడిని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చారని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. స్థానిక, స్వదేశీ ఉగ్రవాదులు ఈ హత్యలో పాల్గొన్నారని సమాచారం.
జమ్మూకశ్మీర్‌లోని పలువురు ఉగ్రవాదులతో షాహిద్ లతీఫ్‌కు సంబంధాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. తీవ్రవాద సంస్థలతో కలిసి అతడు అనేక దాడులు చేశాడు. ఉగ్రవాద సంస్థ ‘జైషే మహ్మద్’ కమాండర్ అయిన లతీఫ్‌పై భారత్‌లో పలు కేసులు ఉన్నాయి. పాకిస్థాన్‌తో సంబంధాలను సరిదిద్దుకునేందుకు యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో భాగంగా లతీఫ్‌తో పాటు మరో 24 మంది ఉగ్రవాదులను 2010లో భారత్ విడుదల చేసింది.
షాహిద్ లతీఫ్ గుజ్రాన్‌వాలా (పాకిస్తాన్) నివాసి. 1990ల ప్రారంభంలో జైషే మహ్మద్ మాతృక ‘హర్కత్-ఉల్-ముజాహిదీన్’ సంస్థ కాశ్మీర్ థియేటర్‌లోకి ప్రవేశించినప్పుడు లతీఫ్ కథ ఆరంభం అయింది. 12 నవంబరు 1994లో ఉపాచట్టం కింద అరెస్ట్ అయిన లతీఫ్..16 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. ఆపై 2010లో వాఘా బోర్డర్ ద్వారా పాకిస్తాన్ చేరాడు. 2 జనవరి 2016లో పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడిలో అతడు కీలక పాత్ర పోషించాడు. సియోల్‌కోట్ నుంచే ఈ దాడిని అతడు పర్యవేక్షించాడు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసి ఏడుగురు జవాన్ల మరణానికి కారణమయ్యాడు.