Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి మిడిల్ ఈస్ట్ లో మరోసారి టెన్షన్ వాతావరణం తీసుకువచ్చింది. హమాస్ దాడుల వల్ల ఇప్పటి వరకు 1200 మందికి పైగా ఇజ్రాయిలీ పౌరులు మరణించగా.. పలువురు బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లింది హమాస్. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. హమాస్‌ని పూర్తిగా నాశనం చేసేదాకా విశ్రమించేది లేదని తేల్చి చెప్పింది. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానికి దాడులను చేస్తోంది. మరోవైపు ఈ దాడుల్లో గాజాలో కూడా 1500కి పైగా మంది మరణించారు. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 3000 వేలకు చేరింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం గాజాలో ఉన్న ఏకైక విద్యుత్ కేంద్ర కూడా పనిచేయడం లేదని నివేదికలు తెలిపాయి. దీంతో గాజాలో అంధకారం అలుముకుంది. ఇప్పటికే ఆ ప్రాంతానికి నీరు, ఆహారం, ఇంధనం ఇలా ప్రతీ అవసరాన్ని ఇజ్రాయిల్ సైన్యం కట్ చేసింది.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ మాట్లాడుతూ, “విద్యుత్ ఉండదు, ఆహారం లేదు, ఇంధనం ఉండదు, ప్రతిదీ కట్ చేస్తామని” హెచ్చరించారు. అక్టోబర్ 7 హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయిల్ గాజాలోని పలు ప్రాంతాలకు పూర్తిగా విద్యుత్‌ని నిలిపేసింది. తాజాగా పాలస్తీనా ఎన్‌క్లేవ్ లోని ఏకైక పవర్ స్టేషన్ పనిచేయడం ఆగిపోయింది.