Terrorists: విదేశీ గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉగ్రవాదులను పిట్టల్లా రాలిపోతున్నారు. ఎవరు చంపుతున్నారో తెలియదు, ఎందుకు చంపుతున్నారో తెలియదు, కానీ చనిపోయేది మాత్రం ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులే. తాజాగా 2016 పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ జైషే మహ్మద్ ఉగ్రవాది షాహీద్ లతీఫ్ పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో బుధవారం హతమయ్యాడు. గుర్తుతెలియని దుండగులు లతీఫ్ ని కాల్చి చంపారు.
భారత వ్యతిరేక ఉగ్రవాదులకు ఇన్నాళ్లు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్‌లో ఇప్పుడు భయం మొదలైంది. బయటకు వెళ్లే ఎవరు ఎక్కడి నుంచి దాడి చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు హతమైన ఉగ్రవాదులి లిస్టును పరిశీలిస్తే..
షాహీద్ లతీఫ్:
2016లో పఠాన్ కోట్ ఉగ్రదాడిలో ఏడుగురు భారత వైమానిక దళ సిబ్బంది మరణించారు. ఈ దాడికి జైషే మహ్మద్ ఉగ్రవాది షాహీద్ లతీఫ్ కారణం. బుధవారం పాకిస్తాన్ లోని సియాల్ కోట్ జిల్లాలోని దస్కా పట్టణంలో మసీదు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
రియాజ్ అహ్మద్:
రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్. జనవరి 1న రాజౌరీలోని ధంగ్రీ గ్రామంలో ఉగ్రవాద దాడికి ప్రధాన కారకుడు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఇతడు సెప్టెంబర్ నెలలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని రావల్ కోట్ లోని అల్-ఖుదుస్ మసీదులో కాల్చి చంపబడ్డాడు.
హర్దీప్ సింగ్ నిజ్జర్:
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కి ఇతను చీఫ్ గా ఉన్నాడు. యువకులకు శిక్షణ ఇవ్వడం, రిక్రూట్ చేయడం వంటివి చేస్తున్నాడు.
బషీర్ అహ్మద్ పీర్:
పాకిస్తాన్ రావల్పిండిలో బషీర్ అహ్మద్ పీర్ ని కాల్చి చంపారు. ఇతను హిజ్బుల్ ముజాహీదీన్ ఉగ్ర సంస్థ కమాండర్.జమ్మూ కాశ్మీర్ లోని పలు ఉగ్ర ఘటనల్లో ఇతని ప్రమేయం ఉంది.
సయ్యద్ ఖలీద్ రజా:
పాకిస్తాన్ లోని కరాచీలో కాల్చిచంపబడ్డాడు. అల్ బదర్స్ కమాండర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో గుర్తు తెలియని వ్యక్తలు కాల్చి చంపారు.
మిస్త్రీ జహుర్ ఇజ్రహీం:
ఇండియన్ ఎయిర్‌లైన్ ఐసీ 814 హైజాకర్లలో ఒకరైన మిస్త్రీ బహూర్ ఇబ్రహీంను పాకిస్తాన్ కరాచీలో బైక్ పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు. డిసెంబర్ 24, 1999న ఖాట్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఇబ్రహీం కూడా ఉన్నాడు.
పరంజిత్ సింగ్ పంజ్వార్:
ఖలిస్తానీ ఉగ్రవాది, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్(కేసీఎఫ్) చీఫ్ పరంజిత్ సింగ్ పంజ్వార్ ని గుర్తు తెలియని వ్యక్తలు లాహోర్ లో హత్య చేశారు. హత్యలు, డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కేసుల్లో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు.
లాల్ మహ్మద్:
లాల్ మహ్మద్ అలియాస్ మహ్మద్ దర్జీ పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఏజెంట్. ఇతడిని సెప్టెంబర్ 19న నేపాల్ రాజధాని ఖాట్మాండులో కాల్చిచంపారు. భారతదేశంలో నకిలీ నోట్ల సరఫరాలో కీలక సూత్రధారి.
తృటితో తప్పించుకున్న టెర్రరిస్టులు:
జమాద్ ఉద్ దవా, లష్కరే తోయిబా చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీస్ సయీద్ 2021 జూన్ నెలలో లాహోర్ లోని తన ఇంటి వద్ద జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. పేలుడు సమయంలో సయీద్ ఇంట్లో లేడు. అతని కుమారుడు తల్హా సయీద్ 2019లో ఓ మతపరమైన కార్యక్రమంలో జరిగిన పేలుడు నుంచి తప్పించుకున్నాడు.
ఉరీ, పఠాన్ కోట్, పార్లమెంట్‌పై దాడిలో కీలక నిందితుడు జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ 2019 ఫిబ్రవరి నుంచి పెషావల్ లోని మదర్సాలో ఆశ్రయం పొందాడు. రెండు నెలల తర్వాత మసూద్ అజార్ ఆశ్రయం పొందిన చోట పేలుడు సంభవించింది. తృటిలో ఈ పేలుడు నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి కనిపించకుండా ఉన్నాడు.