Israel: గాజాపై విరుచుకుపడేందుకు ఇజ్రాయిల్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. శనివారం హమాస్ టెర్రరిస్టులు జరిపిన దాడిలో 900 మంది వరకు ఇజ్రాయిల్ ప్రజలు చనిపోయారు. ఇదిలా ఉంటే భారీ స్థాయిలో యుద్ధం చేసేందుకు ఇజ్రాయిల్ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే తాము యుద్ధంలో ఉన్నామని ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యహూ ప్రకటించాడు. యుద్ధం మీరు మొదలుపెట్టారు, తాము ముగిస్తామని హమాస్‌కి వార్నింగ్ ఇచ్చారు.
హమాస్ ఇప్పటికే దాడులు చేస్తుండగా.. మరోవైపు లెబనాన్ నుంచి మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా కూడా దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ మరింత శక్తివంతంగా తయారువుతోంది. 3 లక్షల రిజర్వ్ ఆర్మీని సమీకరించింది. ఇతర దేశాల్లో ఉంటే ఇజ్రాయిల్ పౌరులు మాతృభూమి రక్షణ కోసం ఇజ్రాయిల్ వెళ్తున్నారు. చాలా మంది ఇప్పటికే సైన్యంలో చేరారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 3,00,000 మంది రిజర్వ్ ఆర్మీ యాక్టీవ్ కావడంతో రాబోయే కాలంలో భారీ ఎత్తున యుద్ధం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు గాజా ప్రాంతంలో వైమానిక దాడులకు మాత్రమే పరిమితమైన ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్), ఇక గాజా స్ట్రిప్ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లేందుకు సమాయత్తం అవుతుందని సమాచారం. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పౌరులను కిడ్నాప్ చేసి గాజాలోకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సైన్యం కూడా గాజాలోకి చొచ్చుకెళ్లి యుద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజాలోని సాధారణ పౌరులను ఈజిప్టు వెళ్లాల్సిందిగా ఇజ్రాయిల్ హెచ్చరించింది. గాజాకు నీటి సరఫరా, కరెంట్ వంటి సదుపాయాలను కట్డడి చేసింది.చివరి సారిగా 2014లో ఇజ్రాయిల్ భూతలం నుంచి దాడి చేసింది. ఏడు రోజులు జరిగిన ఈ యుద్ధంలో 2000 మంది పాలస్తీనియన్లు మరణించగా.. 67 సైనికులతో పాటు 73 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు.
తాము భూతలం నుంచి దాడి ప్రారంభిస్తామని ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి పలు మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి. 140 చదరపు మైళ్లు ఉన్న గాజా ప్రాంతం ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉండే ప్రాంతాల్లో ఒకటి. దాదాపు 20 లక్షల మంది నివసిస్తున్నారు. బందీలను గుర్తించేందుకు ప్రతిబంధకంగా మారుతోంది. మరోవైపు హమాస్, ఇజ్రాయిల్ మధ్య సంధికి ఖతార్ ముందుకు వచ్చింది.
ఏమిటీ రిజర్వ్ ఆర్మీ:
కోటి కన్నా తక్కువ జనాభా ఉన్న ఇజ్రాయిల్, టెక్నాలజీ పరంగా చాలా పవర్ ఫుల్ కంట్రీ. అయితే ఇజ్రాయిల్ చుట్టు పక్కల ఉన్న అరబ్ దేశాలతో నిత్యం శతృత్వం ఉండటంతో ఆ దేశ మిలిటరీ చాలా పవర్ ఫుల్ గా తయారైంది. దేశంలో స్త్రీ, పరుష భేదం లేకుండా ప్రతీ వ్యక్తి కూడా 18 ఏళ్లు పైబడిన వెంటనే సైన్యంలో తప్పనిసరిగా పనిచేశాలి. కనీసం 2-3 ఏళ్లు సైన్యంలో విధులు నిర్వహించాలి. దివ్యాంగులు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పా మిగిలిన ఎవరికీ మినహాయింపు ఉండదు. అయితే యుద్ధ సమయాల్లో రిజర్వ్‌గా ఉంటే ప్రతీ ఒక్కరూ సైన్యంతో కలిసి సేవలు అందించాల్సిందే. జర్నలిస్టులు, నటీనటులు, ఆ దేశ సెలబ్రెటీలు ఎవరైనా ముందుకు రావచ్చు.