
Afghanistan Earthquake: పేదరికం, ఉగ్రవాదంతో కష్టంగా బతుకీడుస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో శనివారం భారీ భూకంపం సంభంవించింది. హెరాత్ ప్రావిన్సులో సంభవించిన భూకంపం ధాటికి 1000 మందికి పైగా చనిపోయినట్లు తాలిబాన్ అధికారులు ప్రకటించారు. 12 గ్రామాల్లో 600 ఇళ్లు ధ్వంసమైనట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.
శనివారం నుంచి 8 సార్లు భూకంపం సంభవించింది. ప్రావిన్సులోని హెరాత్ పట్టణానికి వాయువ్యంగా 30 కిలోమీటర్ల దూరంలో ప్రాంతాలను భూకంప కుదిపేసింది. చాలా వరకు మట్టితో కట్టిన ఇళ్లు కావడం, కొండచరియల ప్రాంతాల్లో నివాసాలు ఉండటంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 4200 మంది ప్రజలు భూకంపం ధాటికి ప్రభావితమయ్యారు.
హెరాత్ ప్రావిన్సు ఇరాన్ తో సరిహద్దు పంచుకుంటుంది. ఈ ప్రాంతంలో 1.9 మిలియన్ల మంది నివసిస్తున్నారు. హిందూకుష్ ప్రాంతంలో ఉండే ఈ ప్రావిన్సులో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతంలో నేల అంతర్బాగాన యురేషియా టెక్టానిక్ ప్లేట్, ఇండియా టెక్లానిక్ ప్లేట్ల జంక్షన్ ఉంది. ఈ పలకలు తరుచుగా ఒకదానితో ఒకటి ఢీకొట్టడం మూలంగా భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. గత ఏడాది జూన్లో 5.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 1,000 మందికి పైగా మరణించారు మరియు పదివేల మంది నిరాశ్రయులయ్యారు.