
Hamas Attack On Israel: గాజాను పాలిస్తున్న హమాస్ మిలిటెంట్లు ఎప్పుడూ లేని విధంగా ఇజ్రాయిల్ పై భీకరదాడి చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 300 మందికిపైగా ఇజ్రాయిలు చనిపోగా.. చాలా మందిని బందీలుగా మిలిటెంట్లు పట్టుకుని, గాజాకు తీసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌తో సహా వివిధ దేశాలు హమాస్ దాడిని ఖండించాయి. అయితే ఇరాన్ మాత్రం హమాస్ దాడికి మద్దతు తెలుపుతూ, ఈ దాడి ఎంతో గర్వంగా ఉందని వ్యాఖ్యానించింది. పలు ఇస్లామిక్ దేశాల్లో ప్రజలు కూడా ఇజ్రాయిల్‌పై దాడిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ దాడి వెనక ఇరాన్ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఇరాన్-ఇజ్రాయిల్ ఉప్పూనిప్పుగా ఉన్నాయి. అయితే గతంలో ఇస్లామిక్, అరబ్ ప్రపంచంతో సత్సంబంధాలు లేని ఇజ్రాయిల్ ఇప్పుడిప్పుడే వాటితో సయోధ్యను కదుర్చుకుంటోంది. ముఖ్యంగా సౌదీ, యూఏఈ దేశాలతో ఇజ్రాయిల్ సంబంధాలు గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగుపడ్డాయి. సౌదీ-అమెరికా-ఇజ్రాయిల్ డీల్ కీలకంగా మారింది. అయితే ఈ డీల్‌ని చెడగొట్టేందుకే ఇరాన్, హమాస్ మిలిటెంట్లకు సాయం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రసిద్ధ మీడియా సంస్థలు ఇదే వాదనల్ని కథనాలుగా ప్రచురించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జీ20 సమావేశంలో ఇండియా-మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ పై సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికా, ఇండియా, ఇజ్రాయిల్ దేశాలు ఒప్పందానికి వచ్చాయి. దీని ద్వారా మిడిల్ ఈస్ట్-ఇజ్రాయిల్ ని రైలు మార్గాలతో కనెక్ట్ చేయబడుతుంది. ఈ పరిణామాలు ఇరాన్ మినహా ఇతర అరబ్ దేశాలను ఇజ్రాయిల్ కి మరింత దగ్గర చేస్తాయనే భయం కూడా ఇరాన్ లో ఉండొచ్చు.
ఇరాన్ ఇటు ఇజ్రాయిల్‌కి, సౌదీకి ఉమ్మది శత్రువు . ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్-సౌదీ-యూఎస్ మధ్య త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఇరాన్ కి చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నాయి. అయితే ఈ డీల్ ను అడ్డుకునే ఉద్దేశంలో ఇరాన్, హమాస్ దాడిని ప్రేరేపించినట్లు తెలుస్తోంది. యూదు రాజ్యంతో సంబంధాలను సాధారణీకరించడానికి ప్రయత్నించే ఏ దేశాలైన నష్టాన్ని చవిచూస్తాయని గతంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ హెచ్చరించారు.
ఈ దాడును ఇరు పక్షాలు నిలిపేయాలని సౌదీ అరేబియా శనివారం పిలుపునిచ్చింది. ఇజ్రాయిల్ వైపు ప్రయోగించే ప్రతీ రాకెట్ లో ఇరాన్ హస్తముందని పాలస్తీనా అధికారి ఒకరు చెప్పారు. లెబనాన్ లోని హమాస్ నాయకుడు ఒసామా హమ్దాన్ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ భద్రతా డిమాండ్లను అంగీకరించడం ఈ ప్రాంతంలో శాంతిని తీసుకురాదని శనివారం దాడితో అరబ్ దేశాలు గ్రహించాయని అన్నారు. ఈ ప్రాంతంలో స్థిరత్వం, శాంతిని కోరుకుంటే ఇజ్రాయిల్ ఆక్రమణను అంతం చేయాలని అతను చెప్పాడు. ఈజిప్లుతో పాటు పలు అరబ్ దేశాలు ఇజ్రాయిల్ తో సంబంధాలను సాధారణీకరించడం పాలస్తీనియన్ల ఆంకాంక్షలకు దగ్గర లేవని అతను చెప్పాడు.