
Israel: ఇజ్రాయిల్‌పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల దారుణ దాడుల తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాలోని తాగునీరు, కరెంట్, ఇంధనం, నిత్యావసరాలను కట్ చేసింది. ఇదిలా ఉంటే హమాస్ దాడులకు మద్దతుగా లెబనాన్ నుంచి హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయల్ పై దాడులు చేస్తున్నారు. దీంతో పాటు సిరియా నుంచి కూడా దాడుల్ని ఎదుర్కొంటోంది. ఇలా మూడు వైపుల నుంచి ఇజ్రాయిల్ దాడులను ఎదురు నిలిచి పోరాడుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) సిరియాపై గురువారం దాడులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ దేశంలోని విమానాశ్రయాలను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. డమాస్కస్, అలెప్పోలోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సిరియా స్టేట్ టెలివిజన్ టెలిగ్రామ్ లో నివేదించింది. నివేదికల ప్రకారం రెండు నగరాల్లోని ఎయిర్ పోర్టుల్లోని రన్ వేలను దాడులు తాకినట్లు తెలిసింది.
సిరియా విమానాశ్రయాలపై ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్ కి చెందిన మహాన్ ఎయిర్ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఈ విమానాన్ని తిరిగి టెహ్రాన్ పంపించారు. నివేదికల ప్రకారం ఈ విమానంలో పలువురు ఇరాన్ దౌత్యవేత్తలు ఉన్నట్లు సమాచారం. దాడుల నేపథ్యంలో సిరియాకు వచ్చే విమానాలు రద్దయ్యాయి.