
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మొదలై 7 రోజులు గడిచాయి. గత శనివారం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై రాకెట్లతో విరుచుకుపడింది. కేవలం 20 నిమిషాల్లోలనే 5000 రాకెట్లను ప్రయోగించింది. ఇంతే కాకుండా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి దొరికినవాళ్లను దొరికినట్లు కాల్చి చంపారు. వందల మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. ఇప్పటికే హమాస్ దాడిలో 1200 మందికి పైగా ఇజ్రాయిలీ ప్రజలు మరణించారు.
మరోవైపు హమాస్ ను తడిచిపెట్టే దిశగా ఇజ్రాయిల్ భారీ దాడులు చేస్తోంది. ముఖ్యంగా గాజా స్ట్రిప్ లోని హమాస్ స్థావరాలపై వైమానికి దాడులు నిర్వహిస్తోంది. ఐసిస్ ను నలిపేసినట్లు హమాస్ ను కూడా అంతం చేస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఇప్పటికే గాజా ప్రాంతాన్ని ఇజ్రాయిల్ దిగ్భంధించింది. బందీలను విడిచిపెట్టే వరకు నీరు, కరెంట్, ఇంధన రాదని తెగేసి చెప్పింది. గాజాలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
ఇదిలా ఉంటే గత 24 గంటల్లో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 13 మంది ఇజ్రాయిలీ, విదేశీ బందీలు చనిపోయినట్లుగా హమాస్ శుక్రవారం ప్రకటించింది. హమాస్ చెరలో 150 మంది వరకు బందీలు ఉన్నట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇప్పటి వరకు గాజాపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 1500 మంది వరకు మరణించారు. మొత్తంగా మరణాల సంఖ్య 3000లను దాటింది. అంతకుముందు హమాస్, ఇజ్రాయిల్ కి వార్నింగ్ ఇచ్చింది. గాజాలో జరిపే ప్రతీ దాడికి ఒక్కో బందీని బహిరంగంగా ఉరితీస్తామని హెచ్చరించింది.