
Hamas Attack On Israel: ఇజ్రాయిల్ లో హమాస్ జరిపిన హత్యాకాండలో దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నరరూప రాక్షసుల్లా ప్రవర్తించిన హమాస్ ఉగ్రవాదులు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మిషిన్ గన్లలో కాల్చుతూ.. పిల్లల తలలను తెగ నరుకుతూ అత్యంత పాశవిక దాడులకు పాల్పడ్డారు. గాజా సరిహద్దులోని ఓ కిబ్బుట్జ్ లో ఏకంగా 40 మంది పిల్లలను అత్యంత దారుణంగా చంపడం యావత్ ప్రపంచాన్ని కలవరపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా మరో వికృత చర్య వెలుగులోకి వచ్చింది. తల్లి గర్భంలో ఉన్న శిశువును కూడా వదలిపెట్టలేదు హమాస్ ఉగ్రవాదులు, గర్బాన్ని చీల్చి, శిశువును దారుణంగా పొడిచి చంపారు.
ఇజ్రాయిల్ లోని అష్‌దోద్ ప్రాంతానికి చెందిన యోసి లాండౌ, జాకా అనే సంస్థలో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదాలు, ప్రకృతి వివత్తుల సమయంలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తుంటాడు. గత మూడు దశాబ్దాలుగా ఆయన మరణించిన వారి మృతదేహాలు సేకరిస్తున్నాడు. అయితే హమాస్ దాడిలో మరణించిన మృతదేహాలను సేకరించేటప్పుడు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇంతటి మారణకాండని ఎప్పుడూ చూస్తాననుకోలేదని హత్యల గురించి వివరించాడు. ఓ గర్భిణి హత్యను చూసినప్పుడు కన్నీరు ఆపుకోలేదని చెప్పాడు.
శనివారం సైరన్లు, హెచ్చరికలతో నిద్ర లేచామని, అంతలోనే హమాస్ ఉగ్రవాదులు చొచ్చుకువచ్చారని ఆయన వెల్లడించారు. దాడి జరిగిన తర్వాత మృతదేహాలు సేకరించేందుకు గాజా వైపు బయలుదేరామని, రోడ్డుపై కార్లు బోల్తా పడి ఉండటంతో పాటు మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని చెప్పారు. సాధారణంగా రోడ్డు దాటాలంటే 15 నిమిషాలు పడుతుందని, కానీ ప్రతీ మృతదేహాన్ని బ్యాగుల్లో పెట్టేందుకు ఏకంగా 11 గంటల సమయం పట్టిందని, అంతలా హమాస్ దాడి ఉందని అంతర్జాతీయ మీడియాతో తన అనుభవాలు పంచుకున్నాడు.
గాజా ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిబ్బుట్జ్ లోని బిరి ప్రాంతానికి చేరుకున్నామని.. ఓ ఇంట్లో గర్బిణి మృతదేహం చూసి నాతో పాటు నా టీం మొత్తం స్పృహకోల్పోయేంత పనైందని, గర్బిణి పొట్టను చీల్చారని, అందులో బొడ్డుతాడు కూడా తెగని బిడ్డను పొడిచి చంపారంటూ కన్నీటిమున్నీరయ్యారు. కొందరి చేతులు వెనక్కి కట్టి హింసించి చంపడంతో పాటు, యువతులపై లైంగిక దాడులు జరిగాయని లాండౌ తెలిపాడు. ఈ ప్రాంతానికి సమీపంలోని సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పై హమాస్ జరిపిన దాడిలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు.