
Putin: ఇజ్రాయిల్-హమాస్ యుద్దంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ సైన్యం గాజాపై గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తే భారీగా ప్రాణనష్టం జరుగుతుందని ఆయన శుక్రవారం అన్నారు. నివాస ప్రాంతాల్లో భారీ యంత్రాలను ఉపయోగించడం సంక్లిష్ట విషయమని, ఇది తీవ్రపరిణామాలకు దారి తీస్తుందని అన్నారు. ముఖ్యంగా పౌరుల ప్రాణనష్టం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని చెప్పారు.
శనివారం ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు భారీ దాడి చేశారు. ఈ దాడిలో 1200 మందికి పైగా ఇజ్రాయిలీలు మరణించారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడుల్లో హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే గాజా ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టిన ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్), ఆ ప్రాంతానికి నీరు, విద్యుత్, ఇంధనాన్ని కట్ చేశాయి.
ఇజ్రాయిల్ భూతలం మీద భారీ ఆపరేషన్ చేపట్టవచ్చనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, 24 గంటల్లో ఉత్తర గాజాలోని ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. అయితే 1.2 మిలియన్ల జనాభా ఉన్న ఆ ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతానికి వెళ్లడం అంత సులువైన విషయం కాదని ఐక్యరాజ్యసమితి చెప్పింది. ఈ ఆదేశాలను విరమించుకోవాలని ఇజ్రాయిల్ కి సూచించింది. ఇజ్రాయిల్ ఈ ప్రకటన తర్వాత పుతిన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.