Leading News Portal in Telugu

Israel: గాజా ప్రజలకు ఇజ్రాయిల్ అల్టిమేటం.. పెట్టాబేడా సర్దుకుని ప్రజల వలస..


Israel: గాజా ప్రజలకు ఇజ్రాయిల్ అల్టిమేటం.. పెట్టాబేడా సర్దుకుని ప్రజల వలస..

Israel: కార్లపై పరుపులు, పిల్లల్ని పట్టుకుని తల్లితండ్రులు బతుకజీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. హమాస్ ఉగ్రవాదుల దాడి, పాలస్తీనాలోని గాజా ప్రాంతంలోని ప్రజలకు శాపంగా మారాయి. కేవలం 24 గంటల్లో ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ప్రజలు అక్కడి నుంచి దక్షిణం వైపు కదిలివెళ్తున్నారు. కార్లపై బట్టలు, పరుపులు పెట్టుకుని వెళ్తున్న వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కార్లు, బైకులు, ట్రక్కులు, కాలి నడకన ఇలా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్న ప్రాంతాన్ని వదిలి వెళ్తున్నారు. అయితే ఇజ్రాయిల్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ కు హమాస్ ఉగ్రవాదులు ఉత్తర ప్రాంతాన్ని ఖాళీ చేసేది లేదని, మా పాలస్తీనా ప్రజలు ఇజ్రాయిల్ ఆర్డర్ని తిరస్కరిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.

అయితే హమాస్ ఉగ్రవాదులు గాజా ప్రజల్ని మానవ కవచాలుగా వాడుకుంటారని అందుకే దక్షిణ వైపు వెళ్లాలని ఆదేశించినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఆరోపించింది. గాజా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని పిలుపునివ్వడం వినాశకరమైన మానవతా పరిణామాలకు దారి తీస్తాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

శనివారం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై రాకెట్లతో దాడి చేశారు. ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించిన మిలిటెంట్లు మారణహోమానికి పాల్పడ్డారు. చిన్నాపెద్దా, ఆడమగ అనే తేడా లేకుండా దారుణంగా ప్రజల్ని హతమార్చారు. చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరించారు. ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంటే గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ భీకరంగా దాడులు చేస్తోంది. గాజా నగరంలోని హమాస్ స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఇప్పటికే గాజా ప్రాంతాన్ని దిగ్భంధించిన ఇజ్రాయిల్, ఆ ప్రాంతానికి కరెంట్, నీరు, ఇంధనాన్ని కట్ చేసింది. మరోవైపు హమాస్ మిలిటెంట్ల వద్ద బందీలు ఉండటంతో వారిని రెస్క్యూ చేసే ఆపరేషన్ చేసేందుకు ఇజ్రాయిల్ ఆర్మీ సిద్ధమవుతోంది.