Leading News Portal in Telugu

Afghanistan: ఆఫ్ఘానిస్తాన్ మసీదులో పేలుడు.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు..



Afghanistan

Afghanistan: తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్ మరోసారి నెత్తురోడింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. బగ్లాన్ ప్రావిన్సు రాజధాని పోల్-ఏ-ఖోమ్రీలోని ఓ మసీదులో ఈ ఘటన జరిగింది. దేశంలో మైనారిటీ వర్గమైన షియా మసీదులో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. 40 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఇమామ్ జమాన్ మసీదులో శుక్రవారం ప్రార్థనల కోసం షియా ప్రజలు గుమిగూడుతుండగా పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు.

Read Also: Anil Ravipudi: మహేష్ తో సినిమా.. అసలు నిజం చెప్పిన అనిల్ రావిపూడి

తాలిబాన్లు ఆఫ్ఘన్ లో అధికారం చేపట్టిన తర్వాత నుంచి అక్కడ జరిగిన ఉగ్రదాడులన్నింటికీ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) బాధ్యత వహిస్తోంది. గతంలో అనేక మసీదుల్లో ఇలానే ఆత్మాహుతి బాంబర్లు తమను తాము పేల్చుకుని మరణించారు. ఈ సంఘటనల్లో ఐఎస్ ఉగ్రసంస్థ హస్తం ఉంది. ముఖ్యం షియాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు.

తాలిబాన్ పాలన తిరిగి వచ్చిన తర్వాత ఐఎస్ రెచ్చిపోతోంది. కాబూల్ లోని దౌత్యకార్యాలయాలను కూడా టార్గెట్ చేస్తోంది. ఇద్దరు ప్రావిన్షియల్ గవర్నర్లను హత్య చేసింది. 2022 సెప్టెంబర్ లో రాజధానిలోని మైనారిటీ షియా స్టడీ హాలుపై బాంబు దాడి చేసింది. దీంట్లో 46 మంది బాలికలతో సహా 53 మంది మరణించారు.