Leading News Portal in Telugu

France: ఇజ్రాయిల్-హమాస్ ఘర్షణ వేళ.. ఫ్రాన్స్‌ స్కూల్‌లో కత్తితో దాడి.. ఉగ్రచర్యగా అనుమానం..


France: ఇజ్రాయిల్-హమాస్ ఘర్షణ వేళ.. ఫ్రాన్స్‌ స్కూల్‌లో కత్తితో దాడి.. ఉగ్రచర్యగా అనుమానం..

France: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అయితే ఇరాన్ తో పాటు పలు ఇస్లామిక్ దేశాలు, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో హమాస్, పాలస్తీనాకు అనుకూలంగా పలువురు ర్యాలీలు చేస్తున్నారు. దీంతో ఆయా దేశాల్లోని యూదులు, ఇజ్రాయిల్ మద్దతుదారులు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. చైనాలో ఓ వ్యక్తి శుక్రవారం ఏకంగా ఇజ్రాయిల్ రాయబార సిబ్బందిపైనే కత్తితో దాడి చేశాడు.

ఇదిలా ఉంటే ఫ్రాన్స్ లోని ఉత్తర ప్రాంతంలో అరాస్‌లోని ఓ స్కూల్ లో శుక్రవారం కత్తితో ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో టీచర్ మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అయితే ఇది ఉగ్రవాద దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. అనుమానిత వ్యక్తిని రష్యాలోని జన్మించిన చెచెన్‌గా, లైసీ గంబెట్టా హై స్కూల్ పూర్వ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. అయితే అతడు రాడికల్ ఇస్లామిక్‌‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

అయితే దాడి సమయంలో అతను ‘‘అల్లాహు అక్బర్’’ అంటూ నినాదాలు చేశారని అక్కడి స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. అయితే పోలీసులు దీన్ని ఇంకా ధృవీకరించలేదు. నిందితుడి వయసు 20 ఏళ్లుగా గుర్తించారు. కత్తి దాడిలో చనిపోయిన వ్యక్తిని ఫ్రెంచ్ భాషా ఉపాద్యాయుడిగా గుర్తించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు అరాస్ వెళ్తున్నట్లు అతని కార్యాలయం ప్రకటించింది.

అయితే ఈ దాడిలో ఇజ్రాయిల్-హమాస్ ప్రమేయాన్ని ఇంకా గుర్తించలేదు. ఇటీవల కాలంలో ఫ్రాన్స్ లో రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడుతున్నాయి. అక్కడ సాధారణ ప్రజాజీవితానికి భంగం కలిగిస్తున్నాయి. ఇదిలా పాలస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్ లో ఆందోళనలు జరిగాయి. మక్రాన్ సర్కారు ఈ ర్యాలీలపై నిషేధం విధించింది. గత శనివారం హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 13 మంది ఫ్రెంచ్ దేశస్తులు చనిపోగా, 17 మంది ఆచూకీ లభించలేదు.