
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్దంలో ఇజ్రాయిల్ సైన్యానికి కీలక విజయం లభించింది. హమాస్ ఉగ్ర సంస్థ వైమానిక దళాల అధిపతి మరణించినట్లుగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. గాజా స్ట్రిప్ లో రాత్రిపూట జరిగిన వైమానిక దాడిలో కీలక హమాస్ నేత మరణించినట్లు తెలిపింది.
అక్టోబర్ 7న, శనివారం రోజున హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడులు చేశారు. వేల సంఖ్యలో రాకెట్లతో విరుచుకుపడ్డారు. మరికొంతమంది ఉగ్రవాదులు పారాగ్లైడర్ల సాయంతో ఇజ్రాయిల్ భూభాగంలోకి చొచ్చుకువచ్చారు. ఈ పారాగ్లైడర్ల దళానికి కీలక మార్గనిర్దేశాలు ఇచ్చిన హమాస్ వైమానిక దళాల చీఫ్ మురాద్ అబు మురాద్‌ని హతం చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది.
గత వారం ఇజ్రాయిల్ లోకి చొరబాటుకు నాయకత్వం వహించిన హమాస్ కమాండో దళాలకు చెందిన డజన్ల కొద్దీ లక్ష్యాలపై రాత్రిపూట దాడులు నిర్వహించినట్లు ఐడీఎఫ్ తెలిపింది. గత శనివారం హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 1300 మంది ఇజ్రాయిలీలు మరణించారు. 150కి పైగా బందీలను హమాస్ ఉగ్రవాదులు గాజాకు తరలించారు. ఇజ్రాయిల్ లోపల దాడులకు పాల్పడిన 1500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయిల్ తెలిపింది.