Leading News Portal in Telugu

Israel-Hamas War: వాహనాలే శవాగారాలు.. ఐస్ క్రీం ట్రక్కుల్లో మృతదేహాలు.. గాజాలో దయనీయ పరిస్థితి..


Israel-Hamas War: వాహనాలే శవాగారాలు.. ఐస్ క్రీం ట్రక్కుల్లో మృతదేహాలు.. గాజాలో దయనీయ పరిస్థితి..

Israel-Hamas War: హమాస్ చేసిన తప్పులకు గాజా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దొరికినవారిని దొరికినట్లు దారుణంగా చంపేశారు. ఆడవాళ్లపై అత్యాచారాలకు తెగబడంతో పాటు అభంశుభం తెలియని చిన్నారులను తలలు నరికి చంపారు. ఈ దాడుల్లో ఇజ్రాయిల్ వైపు 1300 మంది ప్రజలు మరణించారు. ఈ దాడితో తీవ్ర ప్రతీకారేచ్ఛతో ఇజ్రాయిల్ రగిలిపోతోంది. గాజాపై నిప్పుల వర్షం కురిపిస్తోంది.

ఇజ్రాయిల్ వైమానిక దాడుల వల్ల గాజా స్ట్రిప్ దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. హమాస్ స్థావరాలపై భీకరదాడులు చేస్తోంది. హమాస్ కార్యకర్తలు ఉన్నారన్న అనుమానం ఉన్న ప్రతీ భవనాన్ని లేపేస్తోంది. భారీ దాడులతో గాజా ప్రాంతంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ 2300 మందికి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి.

అంతంత మాత్రం ఆరోగ్య సదుపాయలు ఉన్న గాజా ప్రాంతంలో పరిస్థితులు దిగజారుతున్నాయి. మృతదేహాలను పెట్టేందుకు ఆస్పత్రిలో స్థలం లేకపోవడంతో ఐస్ క్రీమ్ తరలించే ట్రక్కుల్లో మృతదేహాలను నిల్వ చేస్తున్నారు. ఐస్ క్రీం కంపెనీల నుంచి ఐస్ క్రీం ఫ్రీజర్లను తీసుకుని వచ్చామని, ఆస్పత్రి మార్చురీలో కేవలం 10 మృతదేహాలను మాత్రమే పెట్టగలిగే సామర్థ్యం ఉందని డీర్అల్ లోని షుహదా అల్-అక్సా ఆస్పత్రికి చెందిన డాక్టర్ యాసర్ అలీ చెప్పారు. ఇలాగే యుద్ధం కొనసాగితే శ్మశానాలు కూడా సరిపోవని, ఇప్పటికే అవన్నీ నిండిపోయాయని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు.

సూపర్ మార్కెట్లకు ఐస్ క్రీమ్‌లను సరఫరా చేసే ట్రక్కుల్లో మృతదేహాలను తాత్కాలికంగా భద్రపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ వాహనాలే గాజాలో శవాగారాలుగా మారాయి. అయితే లెక్కకు మించి మృతదేహాలు వస్తుండటంతో ఈ టక్కులు కూడా సరిపోవడం లేదు. ఒక్కో ట్రక్కులో 20-30 మృతదేహాలను పెడుతున్నారు.

ఎనిమిది రోజుల క్రితం ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ మధ్య యుద్ధం మొదలైంది. గాజాలో 2300 మంది మరణిస్తే వీరిలో నాలుగింట ఒకవంతు పిల్లుల ఉన్నారు.
మరోవైపు ఇజ్రాయిల్ ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. దక్షిణంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. గాజా స్ట్రిప్ ని దిగ్భందించిన ఇజ్రాయిల్ తాగునీరు, కరెంట్, ఇంధనాన్ని కట్ చేసింది. ఇప్పటి వరకు వైమానిక దాడులకే పరిమితమైన ఇజ్రాయిల్ ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమవుతోంది.