Leading News Portal in Telugu

Israel-Hamas War: హమాస్ చెరలో 199 మంది బందీలు.. ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటన..


Israel-Hamas War: హమాస్ చెరలో 199 మంది బందీలు.. ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటన..

Israel-Hamas War: అక్టోబర్ 7 నాడు ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిని ఇజ్రాయిల్ మరిచిపోలేకపోతోంది. ఇజ్రాయిల్ ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి దాడిని ఎప్పుడూ చూడలేదు. మెస్సాద్ వంటి గూఢాచర సంస్థ, పటిష్ట ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ దాడిని ముందుగా పసిగట్టలేకపోయింది. 20 నిమిషాల వ్యవధిలోనే గాజా ప్రాంతం నుంచి హమాస్ ఉగ్రవాదులు 5000 రాకెట్లను ఫైర్ చేశారు. ఇదే కాకుండా ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి దొరికిన వాళ్లను దొరికినట్లు కాల్చి చంపేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. పసిపిల్లల్ని తలలు నరికి చంపారు.

మరోవైపు ఇజ్రాయిల్ నుంచి పలువురిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీరిని విడిపించేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ప్లాన్ చేస్తోంది. మొత్తం 199 మందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. అంతకుముందు 155 మంది బందీలుగా ఉన్నారని అనుకున్నప్పటికీ.. మరింత విచారణ చేయగా 199గా తేలింది.

హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇజ్రాయిల్ లోని 1400 మంది చనిపోయారు. ఈ దాడితో ప్రతీకారేచ్ఛతో ఉన్న ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 2000లకు పైగా గాజాలోని పాలస్తీయన్లు చనిపోయారు. ఇరు వైపులు 3000 మందికి పైగా ప్రజలు మరణించారు. మరోవైపు యుద్ధం తీవ్రం కావడంతో ఉత్తర గాజాలోని 1.1 మిలియన్ జనాభా దక్షిణంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయిల్ హెచ్చరించింది. హమాస్ ఉగ్రవాదులు ప్రజలను మానవ కవచాలుగా వాడుకునే అవకాశం ఉందని చెప్పింది.

ఇప్పటికే గాజాను చుట్టుముట్టిన ఐడీఎఫ్ బలగాలు ఏ క్షణానైనా భూతల దాడులకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఇప్పటికే గాజా ప్రాంతానికి నీటి సరఫరా, ఇంధనం, విద్యుత్ సరఫరాను ఆపేసింది. ఈ నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. మరోవైపు అమెరికా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఇజ్రాయిల్ తో పాటు అరబ్ దేశాలతో చర్చిస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇప్పటికే ఆయా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు.