
Israel Hamas War: హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ నిరంతరాయంగా దాడులు చేయడంతో తీవ్రవాద సంస్థ ఉలిక్కిపడినట్లు తెలుస్తోంది. అక్టోబరు 7 నుంచి జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో తొలిసారిగా హమాస్ ఓ వీడియోను విడుదల చేసింది. బాంబు దాడిని ఆపాలనే ఉద్దేశంతో బ్లాక్ మెయిల్ చేయడం కోసం హమాస్ ఈ వీడియోను రూపొందించింది. వీడియోలో 21 ఏళ్ల యువతి హమాస్ కమాండర్ నుంచి చికిత్స పొందుతోంది. వాస్తవానికి, 21 ఏళ్ల అమ్మాయి మియా షెమ్‌ను బందీగా ఉంచిన వీడియోను ఉగ్రవాద సంస్థ హమాస్ విడుదల చేసింది. వీడియోలో ఉన్న అమ్మాయి చాలా భయపడుతోంది. అయితే తాను పూర్తిగా క్షేమంగా ఉన్నట్లు ఆమె చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే తనను త్వరగా అక్కడి నుంచి విడిపించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని వేడుకుంది. ఆమెకు హమాస్ చికిత్స అందిస్తోంది.
బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశంతోనే హమాస్ ఈ వీడియోను విడుదల చేసిందని భావిస్తున్నారు. మియా కిడ్నాప్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) కూడా ధ్రువీకరించింది. మియా కుటుంబాన్ని సంప్రదించి ఆమె కిడ్నాప్ అయ్యిందని సమాచారం అందించామని చెప్పింది. ఈ వీడియో ద్వారా అన్ని దేశాలకు ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని, బాధితులను హమాస్ ఆదుకుంటోందని.. ప్రపంచం ముందు తన ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఈ వీడియో ద్వారా ప్రయత్నించారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పేర్కొంది. తమను తాము మానవత్వం గల మనుషులుగా చిత్రీకరించేందుకు హమాస్ ఈ వీడియో విడుదల చేసిందని ఐడీఎఫ్ తెలిపింది. వాస్తవానికి హమాస్ అనేది భయంకరమైన ఉగ్రవాద సంస్థ అని మండిపడింది. అనేక మంది పసిబిడ్డలు, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులును అపహరించారని తీవ్రంగా మండిపడింది. హమాస్ చెర నుంచి వారిని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపాయి.
ఇజ్రాయెల్ మీడియా నివేదిక ప్రకారం, హమాస్ తన అరబిక్ టెలిగ్రామ్ ఛానెల్‌లో మియా షెమ్ వీడియోను విడుదల చేసింది. హమాస్ కమాండర్ బాలికకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు వీడియోలో ఉంది. ఈ వీడియోలో బాలిక దాడిలో గాయపడినట్లు చెబుతోంది. అయితే ఇప్పుడు బాగానే ఉన్నానని ఆమె తెలిపింది. కాగా.. ఇటీవల బందీల పిల్లలను ఆడిస్తున్నట్లు హమాస్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. హమాస్ చెరలో 200 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇటీవల ప్రకటించింది.