Leading News Portal in Telugu

Israel-Hamas War: ఇజ్రాయిల్ చేరుకున్న జో బైడెన్.. హమాస్ ఐసిస్ కన్నా దారుణంగా ప్రవర్తించింది.


Israel-Hamas War: ఇజ్రాయిల్ చేరుకున్న జో బైడెన్.. హమాస్ ఐసిస్ కన్నా దారుణంగా ప్రవర్తించింది.

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్రమవుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడి చేశారు. ఈ దాడిలో 1400 మంది చనిపోయారు. 199 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్, హమాస్ ని పూర్తిగా అతుముట్టించేలా గాజా స్ట్రిప్‌పై భీకరదాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం గాజాలోని ఓ ఆస్పత్రిపై జరిగిన దాడిలో 500 మంది మరణించారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయిల్ పర్యటనకు వచ్చారు. యుద్ధంలో ఇజ్రాయిల్‌కి సంఘీభావం ప్రకటించేందుకు ఆయన ఇజ్రాయిల్ చేరుకున్నారు. టెల్ అవీవ్ చేరుకున్న జో బైడెన్‌ని ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ బెన్, ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు స్వాగతం పలికారు. గాజా యుద్ధంపై నెతన్యాహూ, బైడెన్ చర్చించనున్నారు. ‘‘ నేను ఈరోజు ఇక్కడ ఉండాలనుకున్నాను, ప్రపంచ, ఇజ్రాయిల్ ప్రజలు అమెరికా ఏ వైపున ఉందో తెలుసుకోవడానికి వచ్చాను’’ని బైడెన్ వ్యాఖ్యానించారు.

వందలాది మహిళలను, పిల్లలను చంపేసి హమాస్ దౌర్జన్యాలను ఆయన ఖండించారు. ‘‘హమాస్ ఐసిస్ కన్నా క్రూరంగా దారుణాలకు పాల్పడింది. హమాస్ పాలస్తీనాకు ప్రాధాన్యత వహించదు. పాలస్తీనా ప్రజలకు బాధలను మాత్రమే హమాస్ తీసుకువచ్చిందనేది గుర్తుంచుకోవాలి’’ అని ఆయన అన్నారు.

మరోవైపు హమాస్‌ను అంతం చేసేదాకా విశ్రమించమని ఇజ్రాయిల్ ఇప్పటికే తేల్చి చెప్పింది. వైమానికి దాడులతో గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో గాజాలోని ప్రజలు 3000 మంది మరణించారు. ఉత్తరగాజాలోని ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ఇజ్రాయిల్ హెచ్చరించింది. త్వరలోనే బందీలుగా ఉన్న ప్రజలను విడిపించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) పదాతిదళం భూతల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది.