Leading News Portal in Telugu

Pakistan Economic Crisis: పాక్ ఆర్థిక సంక్షోభం.. 26 విమానాలను రద్దు చేసిన పీఐఏ


Pakistan Economic Crisis: పాక్ ఆర్థిక సంక్షోభం.. 26 విమానాలను రద్దు చేసిన పీఐఏ

Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్, కనీసం తన ప్రభుత్వ ఎయిర్ లైనర్ సంస్థ అయిన పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) కష్టాలు తీర్చే పరిస్థితిలో కూడా లేదు. పీఐఏకి ఇంధనాన్ని సరఫరా చేస్తున్న పాకిస్తాన్ స్టేట్ ఆయిల్(పీఎస్ఓ) ఇకపై ఇంధనాన్ని సరఫరా చేసేది లేదని స్పష్టం చేసింది. పీఐఏ, పీఎష్ఓకు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇవి చెల్లించనిదే, ఇంధనాన్ని సరఫరా చేయనని తెలిపింది. మరోవైపు పీఐఏని ఆదుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ముందుకు రావడం లేదు.

దీంతో పాక్ వ్యాప్తం పీఐఏ విమానాల సర్వీసులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఫలితంగా కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, క్వెట్టా, బహవల్‌పూర్, ముల్తాన్, గ్వాదర్ మరియు పాకిస్తాన్‌లోని ఇతర నగరాల నుండి 26 విమానాలను రద్దు చేసింది. ప్రయాణికులకు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు జియో న్యూస్ నివేదించింది.

అక్టోబర్ 21న రెండు రోజుల ఇంధన సరఫరా కోసం పాక్ స్టేట్ ఆయిల్ కి పీఐఏ 220 మిలియన్ పాక్ రూపాయలను చెల్లించింది. ఇంధన సరఫరా కోసం ఇప్పటి వరకు 550 మిలియన్ల పాక్ రూపాయలను చెల్లించినట్లు పీఐఏ ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం సౌదీ అరేబియా, కెనడా, చైనా, కౌలాలంపూర్ వంటి లాభదాయ రూట్లలో విమానాలను నడిపేందుకు ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. అయితే ఈ పరిస్థితి నుంచి తమను బయటపడేయాలని పీఐఏ పాక్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. 22.9 బిలియన్ల అత్యవసర బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతోంది. అయితే దీన్ని పాక్ తాత్కాలిక ప్రభుత్వం తిరస్కరించింది.

పాకిస్తాన్ గతేడాది కాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఐఎంఎఫ్ తో పాటు ఇతర దేశాల నుంచి అప్పులు కోరుతోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ వ్యాప్తంగా ద్రవ్యోల్భణం తీవ్రస్థాయికి చేరుకుంది. నిత్యవసరాలు ప్రజలకు అందుబాటులో లేవు. ఐఎంఎఫ్ షరతులకు లోబడి విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, ఇతర పన్నులు పెంచడంతో అక్కడి ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు.