Leading News Portal in Telugu

Pakistan: ఆఫ్ఘన్ శరణార్థులకు పాకిస్తాన్ మరో వార్నింగ్.. నవంబర్ 1 డెడ్‌లైన్..


Pakistan: ఆఫ్ఘన్ శరణార్థులకు పాకిస్తాన్ మరో వార్నింగ్.. నవంబర్ 1 డెడ్‌లైన్..

Pakistan: వేల మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ వదిలివెళ్లాలని లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులందరూ.. నవంబర్ 1 కంటే ముందే దేశం నుంచి వెళ్లిపోవాలని పాకిస్తాన్ గురువారం చివరిసారిగా హెచ్చరించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వంలోని అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. నవంబర్ 1 తర్వాత పత్రాలు లేని వలసదారులందరిని తొలగించే ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని పాక్ కృతనిశ్చయంతో ఉంది.

పాకిస్తాన్ లో ఇటీవల జరిగిన పలు ఉగ్రవాద కార్యకలాపాలు, బాంబు పేలుళ్లలో ఆఫ్ఘన్ జాతీయులు ఉన్నారని తేలడంతోనే ఈ నిర్ణయం తసుకున్నట్లు దాయాది దేశం పేర్కొంది. ఇప్పటికే అక్రమ వలసదారులను గుర్తించామని, గడువులోగా స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని మంత్రి బుగ్తీ మరోసారి చెప్పారు. గడువు ముగిసిన తర్వాత అక్రమవలసదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ చేపడుతుందని అన్నారు. వలసదారులను దాచిపెట్టడంలో ప్రేమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

వలసదారుల్లో ఎక్కువగా ఆఫ్ఘన్లు చాలా ఏళ్లుగా పాకిస్తాన్ ‌లో ఉంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక కేంద్రాలో వీరు ఉంటున్నారు. 1979లో ఆఫ్ఘనిస్తాన్ పై రష్యా దండయాత్ర తర్వాత అత్యధికంగా ఆఫ్ఘన్లు పాకిస్తాన్ లోకి వచ్చారు. యుద్ధం, సంఘర్షణను తప్పించుకునేందుకు వేలాది మంది ఆఫ్ఘన్ ప్రజలు పాకిస్తాన్ లోకి వచ్చారు. అనేక మంది ప్రభుత్వం, యూఎన్ ఏజెన్సీల వద్ద శరణార్థులుగా నమోదు చేయబడ్డారు.

ఇటీవల కాలంలో పాకిస్తాన్ వ్యాప్తంగా ముఖ్యంగా సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో భారీ పేలుళ్లు జరిగాయి. కొన్ని రోజుల క్రితం బలూచిస్తాన్ లో ఓ మతపరమైన కార్యక్రమంలో బాంబు పేలుడు కారణంగా 50 మందికి పైగా మరణించారు. ఇదిలా ఉంటే భారత్ కి మోస్ట్ వాంటెడ్ గా ఉన్న పలువురు ఉగ్రవాదుల్ని కూడా గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. అయితే ఈ ఘటనల్లో ఆఫ్ఘన్ జాతీయుల ప్రమేయం ఉన్నట్లు పాక్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్రమ వలసదారుల్ని, ముఖ్యంగా ఆఫ్ఘన్లను దేశం వదిలేయాలంటూ పాకిస్తాన్ హెచ్చరిస్తోంది.