
Israel-Palestine: ఇజ్రాయిల్-హమాస్ మధ్య అక్టోబర్ 7న మొదలైన యుద్ధం భీకరంగా సాగుతోంది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1400 మందిని చంపారు, 200 మంది కన్నా ఎక్కువ మందిని బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకెళ్లారు. అయితే బందీలను సురక్షితంగా విడిపించేందుకు ఇజ్రాయిల్ రెస్క్యూ ఆపరేషన్, భూతల దాడులకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో మాట్లాడిని ఇరాన్ విదేశాంగమంత్రి హుస్సేర్ అమిరబ్దల్లాహియాన్.. బందీలను వదిలేందుకు హమాస్ సిద్ధంగా ఉందని, అయితే అందుకు ఇజ్రాయిల్ జైళ్లలో మగ్గుతున్న 6000 మంది పాలస్తీనియన్లను కూడా విడుదల చేయాలంటూ షరతు పెట్టారు. వీరిని విడిపించేందుకు ప్రపంచం మద్దతు ఇవ్వాలని ఆయన గురువారం యూఎన్ జనరల్ అసెంబ్లీలో కోరాడు.
ప్రతీకారంలో ఇజ్రాయిల్ గాజాపై రాకెట్ దాడులు చేస్తే, అమెరికా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేదని అమీరబ్దోల్లాహియాన్ హెచ్చరించాడు. ఈ ప్రాంతంలో యుద్ధాన్ని మేము స్వాగతించడం లేదని, అమెరికాను హెచ్చరిస్తూ ఆయన వ్యాఖ్యనించారు. ఖతార్, టర్కీ అందిస్తున్న మానవతా ప్రయత్నంలో ఇరాన్ తన వంతు పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉందని ఇరాన్ మంత్రి చెప్పారు.
ఇజ్రాయిల్-హమాస్ పోరులో అమెరికా ఇజ్రాయిల్ కి పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ యుద్ధంలో ఇరాన్ కానీ దాని ప్రాక్సీలు కానీ దాడులకు పాల్పడితే అమెరికా వేగంగా స్పందిస్తుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఇజ్రాయిల్ ఉత్తర భాగంలో దాడులు చేస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్లకు ఇరాన్ సాయం ఉంది. మరో వైపు ఇజ్రాయిల్ కి సాయం కోసం రెండు విమాన వాహక నౌకల్ని మధ్య ప్రాచ్యానికి పంపింది. మరోవైపు ఇజ్రాయిల్ గాజాపై జరిపిన దాడుల్లో 7000 మందికి పైగా మరణించారు.