Leading News Portal in Telugu

Pig Heart Transplant: “పంది గుండె”ను అమర్చుకున్న వ్యక్తి.. 40 రోజుల తర్వాత మృతి


Pig Heart Transplant: “పంది గుండె”ను అమర్చుకున్న వ్యక్తి.. 40 రోజుల తర్వాత మృతి

Pig Heart Transplant: మానవులకు అవయవాలు పాడైతే, వేరే వాళ్లు దానం చేయడమో లేకపోతే మరణించడమో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. జంతువుల నుంచి సేకరించిన అవయవాలను మనుషులకు అమర్చుతున్నారు. ముఖ్యంగా పంది అవయవాల్లో జన్యుమార్పిడి చేసి మనుషులకు అమర్చుతున్నారు. ఇటీవల ఒక వ్యక్తికి పంది కిడ్నీని, మరొక వ్యక్తి పంది గుండెను అమర్చారు. అయితే ప్రారంభ రోజుల్లో సదరు రోగులు బాగానే ఉన్నా తర్వాత మానవ శరీర వ్యవస్థ వాటిని తిరస్కరించడంతో మరణించారు. అయితే కొన్ని రోజుల పాటు వారు జీవించి ఉండటం, పందులకు సంబంధించిన కొన్నాళ్ల పాటు పనిచేయడం శాస్త్రవేత్తలకు భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తోంది.

ఇదిలా ఉంటే తాజా ఇదే విధంగా పందికి గుండెను అమర్చుకున్న రెండో వ్యక్తి మరణించినట్లు సీఎన్ఎన్ నివేదించింది. 58 ఏళ్ల లారెన్స్ ఫౌసెట్ అనే వ్యక్తి ప్రపంచంలోనే పంది గుండెను అమర్చుకున్న రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. సెప్టెంబర్ 20న జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను లారెన్స్ కి పెట్టారు. గుండె వైఫల్యంతో బాధపడుతున్న లారెన్స్, ఇలా పంది గుండెను అమర్చుకున్న తర్వాత 40 రోజుల పాటు జీవించారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, మొదటి నెలలో గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించింది, అయితే ఆ తర్వాత రోజుల్లో గుండెను శరీరం తిరస్కరిస్తున్న సంకేతాలు కనబడ్డాయని, శస్త్ర చికిత్స తర్వాత దాదాపుగా ఆరు వారాలు జీవించి సోమవారం మరణించారు.

శస్త్ర చికిత్స జరిగిన మొదటి రోజుల్లో లారెన్స్ ఫౌసెట్ చాలా ఆరోగ్యంగా ఉంటూ.. కుటుంబ సభ్యులతో గడిపారు. లారెన్స్ భార్య మాట్లాడుతూ.. మాకు తక్కువ సమయం ఉందని తెలుసు, ఇంత కాలం బతుకుతాడని ఊహించలేదని వెల్లడించారు. మానవులకు జంతు అవయవాలను మార్పిడి చేయడాన్ని జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ అని పిలుస్తారు. మానవ అవయవ విరాళాల దీర్ఘకాలిక కొరతకు పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు ఇలా జంతువుల అవయవాలను మానవులకు అమర్చుతున్నారు. అయితే చాలా సందర్భాల్లో మానవుడి సొంత ఆరోగ్య వ్యవస్థ, వేరే వ్యక్తి/జంతువుల అవయవాలపై దాడి చేస్తోంది. జన్యుపరంగా మార్పులు చేయడం వల్ల మానవ అవయవాలుగా జంతువుల అవయవాలు పనిచేస్తాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. మేరీల్యాండ్ బృందం గతేడాది ప్రపంచంలో జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి జనవరి, 2022లో మార్పిడి చేశారు. ఆ తర్వాత రెండు నెలలకు అతను మరణించాడు.