
Israel Hamas War: గాజా స్ట్రిప్‌లో భారత సంతతికి చెందిన ఒక సైనికుడు మరణించాడని భారతదేశంలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కోబి శోషని తెలిపారు. మరణించిన యువకుడు ఇజ్రాయెల్ సైన్యంలో సైనికుడిగా పనిచేస్తున్నాడని.. గాజా స్ట్రిప్‌లో హమాస్ యోధులతో పోరాడుతూ మరణించాడని కోబి శోషని చెప్పారు. గురువారం ముంబైలో రాయబారి కోబి శోషని మాట్లాడుతూ.. భారతీయ సంతతికి చెందిన 20 సంవత్సరాల వయసున్న హెలెల్ సోలమన్ మరణించినట్లు చెప్పారు. వీరితో పాటు 17 మంది ఇజ్రాయెల్ సైనికులు కూడా మరణించారు. హెలెల్ సోలమన్ ఇజ్రాయెల్ సైన్యంలో స్టాఫ్ సార్జెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను ఇజ్రాయెల్‌లోని డిమోనా నగర నివాసి.
సైనికుల మృతిపై నెతన్యాహు ఏం చెప్పారు?
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ మిలటరీ బ్రిగేడ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, మనల్ని ఎవరూ ఆపలేరని అన్నారు. యుద్ధం వల్ల మేం చాలా నష్టపోయాం.. ఈ నష్టం బాధాకరమని, అమరులైన సైనికులంతా మన ప్రపంచం అని, ఎలాంటి పరిస్థితులు మమ్మల్ని అడ్డుకోలేవని ఒక్క విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా’ అని అన్నారు.
సంతాపం వ్యక్తం చేసిన మేయర్
హెలెల్ మరణానికి సంతాపం తెలుపుతూ బెని డిమోనా మేయర్ బిట్టన్ ఫేస్బుక్ ఓ పోస్టు చేశారు. గాజాలో జరిగిన యుద్ధంలో డిమోనా కుమారుడు హెలెల్ సోలమన్ మరణించినట్లు.. తాను విచారంతో ప్రకటిస్తున్నా అన్నారు. హెలెల్ మరణంతో నగరం మొత్తం సంతాపం చెందుతోంది. హెలెల్ దేశానికి సేవ చేయాలని కోరుతూ బ్రిగేడ్‌లో చేరారు. ఇజ్రాయెల్ జెండాతో హెలెల్ అంత్యక్రియలు జరుగుతాయని ఆయన ఒక పోస్ట్‌లో రాశారు. గాజాపై దాదాపు నాలుగు వారాల పాటు ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 9,000 కంటే ఎక్కువ పెరిగిందని గాజా ఆరోగ్య అధికారులు గురువారం నివేదించారు.