Leading News Portal in Telugu

Pakistan: పోలీసులు లక్ష్యంగా పాక్‌లో బాంబుదాడి.. ఐదుగురు మృతి..



Pakistan

Pakistan: బాంబు పేలుళ్లతో మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ దద్దరిల్లింది. శుక్రవారం పాక్ వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలో పేలుడు జరిగింది. పోలీసులే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 21 మంది గాయపడ్డారు. నగరంలోని పోలీస్ పెట్రోలింగ్ రూట్‌కి సమీపంలో బాంబు పేలిందని పోలీస్ అధికారి మహ్మద్ అద్నాన్ తెలిపారు.

అయితే ఈ పేలుడు ఆత్మాహుతి దాడి వల్ల జరిగిందా..? బాంబు అమర్చారా..? అనేది ఇంకా తేలలేదు. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదు. ప్రస్తుతం దాడి జరిగిన నగరం పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ బార్డర్‌కి సమీపంలో పాకిస్తాన్ గిరిజన ప్రాంతంలో ఉంది. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతం ఇస్లామిక్ తీవ్రవాదులకు, పాక్ తాలిబాన్లకు ప్రధాన కేంద్రంగా ఉంది.

Read Also: Uttar Pradesh: పార్టీకి స్నేక్ వైన్ సరఫరా.. డ్రగ్స్ కేసులో బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్..

పాకిస్తాన్ ఇటీవల కాలంలో బాంబు దాడులతో సతమతమవుతోంది. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాల్లో తరుచుగా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పాక్ ఆర్మీ, చైనా ఇంజనీర్లే టార్గెట్‌గా దాడులు చేస్తోంది. ఇక వాయువ్య ప్రాంతంలో పాకిస్తాన్ తాలిబాన్లకు పట్టు ఉంది.

మరోవైపు పాకిస్తాన్ బాంబు పేలుళ్లు, ఉగ్రవాద ఘటనల్లో ఆఫ్ఘన్ వాసుల ప్రమేయం ఉందని చెబుతూ, పాక్ లోని తాత్కాలిక ప్రభుత్వం వలసదారులు ముఖ్యంగా ఆఫ్ఘన్ జాతీయులను దేశం వదలి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పేలుడు సంభవించింది. ఇప్పటికే లక్షలాది మంది ఆఫ్ఘాన్లు, పాక్ వదిలి సొంతదేశాలకు వెళ్లారు.