
Pakistan: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వాలి వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడ్డారు. తెల్లవారుజామున 9 మంది సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు. సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. పాకిస్తాన్ వ్యాప్తంగా అంతకుముందు రోజు జరిగిన టెర్రర్ అటాక్స్‌లో 17 మంది మరణించిన, తర్వాత రోజే ఈ దాడి జరిగింది.
పాక్ ఎయిర్ బేస్‌పై జరిగిన దాడిలో మూడు నాన్ ఆపరేషనల్ ఎయిర్‌క్రాఫ్టులు ధ్వంసమైనట్లు పాక్ ఆర్మీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే పాక్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)కి అనుబంధంగా కొత్తగా ఉద్భవించిన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-జిహాద్ పాకిస్తాన్ (TJP) ఈ దాడికి పాల్పడినట్లు మీడియా ప్రకటనలో బాధ్యత వహించింది. ఈ దాడిని పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ ఖండించారు. ‘‘ మా భద్రతను దెబ్బతీసే ఏ ప్రయత్నమైన తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటుంది’’ అని హెచ్చరించారు.
ఈ దాడికి కొన్ని గంటల ముందే బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో జరిగిన వరస ఉగ్రదాడుల్లో 17 మంది పాక్ సైనికులు మరణించారు. బలూచిస్తాన్ లోని గ్వాదర్ జిల్లాలోని ఒర్మారా ప్రాంతానికి పస్ని నుంచి భద్రతా బలగాలు వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 14 మంది పాక్ సైనికులు మరణించారు. గ్వాదర్ దాడికి కొన్ని గంటల ముందు, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో పోలీసులు మరియు భద్రతా దళాల కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు పేలుళ్లలో ఒక సైనికుడు మరియు మరో ఐదుగురు మరణించారు మరియు 24 మంది గాయపడ్డారు. అదే ప్రావిన్స్‌లోని లక్కీ మార్వాట్ జిల్లాలో జరిగిన మరో దాడిలో ఇద్దరు సైనికులు మరణించారు.
నవంబర్ 2022లో పాక్ తాలిబాన్ల, పాక్ ప్రభుత్వానికి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినప్పటి నుంచి పాకిస్తాన్ లో వరసగా దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా బలూచ్ ప్రాంతంలో పాక్ ఆర్మీకి, పోలీసులకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటు తాలిబాన్లు దాడులు చేస్తుంటే, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన పోరాటయోధులు పాక్ ఆర్మీని, పాక్ ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం ప్రకారం.. 2023 నుంచి మొదటి తొమ్మిది నెలల్లో కనీసం 386 మంది భద్రతా సిబ్బంది మరణించారు.