Leading News Portal in Telugu

Israel-Hamas War: అమెరికాను కొట్టేది ఒక్కడే, అతనే కిమ్.. నార్త్ కొరియా అధినేతపై హమాస్ ప్రశంసలు..


Israel-Hamas War: అమెరికాను కొట్టేది ఒక్కడే, అతనే కిమ్.. నార్త్ కొరియా అధినేతపై హమాస్ ప్రశంసలు..

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ఇప్పట్లో నిలిచేలా కనిపించడం లేదు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని హమాస్ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. దీని తర్వాత నుంచి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు పలువురు ఉగ్రవాదులతో సహా 9000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇజ్రాయిల్ తో పోరుకు హిజ్బుల్లా, హౌతీ మిలిటెంట్లు కాలుదువ్వుతున్నారు.

ఇదిలా ఉంటే వరసగా హమాస్, హిజ్బుల్లా కీలక నాయకులు ఇజ్రాయిల్, అమెరికాలను కవ్విస్తున్నారు. తాజాగా హమాస్ కీలక నేత అలీ బరాకా అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాపై దాడి చేయగల ఉత్తర కొరియా సామర్థ్యాన్ని ప్రశంసించారు. ప్రపంచంలో అమెరికాను కొట్టగల సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి ఉత్తరకొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ అని అన్నారు.

పాలస్తీనియన్లకు, హమాస్‌కి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ మద్దతుపై అడగ్గా అలీ బరాకా ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాది అంతా గతమే అని.. అమెరికా, బ్రిటన్‌లు సోవియట్ యూనియన్ లాగే కూలిపోతాయని, అమెరికా శక్తివంతంగా ఉండదని ఓ ఇంటర్వ్యూలో హమాస్ నేత చెప్పారు. ఇరాన్ గురించి మాట్లాడుతూ.. అమెరికాపై దాడి చేసే సామర్థ్యం ఇరాక్‌కి లేదని అన్నారు.

ఒక వేళ ఇరాన్ జోక్యం చేసుకోవాలని అనుకుంటే.. అది ఇజ్రాయిల్, ఆ ప్రాంతంలోని అమెరికన్ స్థావరాలపై దాడి చేయగలదు, ఇరాన్ వద్ద అమెరికాను చేరుకోగలిగే ఆయుధాలు లేవు, కానీ ఇజ్రాయిల్, అమెరికన్ స్థావరాలు, యుద్ధనౌకలపై దాడులు చేయగలదు. అయితే ఉత్తర కొరియాకు అమెరికాపై దాడి చేయగలిగే సామర్థ్యం ఉంది, అది జోక్యం చేసుకునే రోజు రావచ్చనరి, ఎందుకంటే ఆ దేశం మా కూటమిలో భాగమని బరాకా అన్నారు. అమెరికా శత్రువులందరూ దగ్గరవుతున్నారు, రష్యా, చైనా హమాస్ నాయకులతో సమావేశమయ్యాయి. అమెరికా వ్యతిరేకులు అంతా కలిసి యుద్ధంలో పాల్గొనే రోజు రావచ్చని అన్నారు.