Leading News Portal in Telugu

Pakistan: పాక్‌లో ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం.. ఈ ఏడాది 18 మంది ఖతం..


Pakistan: పాక్‌లో ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం.. ఈ ఏడాది 18 మంది ఖతం..

Pakistan: ఇన్నాళ్లు భారత వ్యతిరేక ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షితం అని భావిస్తుండే వారు.. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఏ ఉగ్రవాది ఎప్పుడు ఎలా కిడ్నాప్ అవుతాడో, ఎప్పుడు ఎక్కడ చనిపోయి పడుంటాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంతలా అంటే పాక్ గూఢాచర సంస్థ ఐఎస్ఐకి కూడా తెలియకుండా గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి పడేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఉగ్రదాడులకు పాల్పడిన వారు, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఖతం అవ్వడం పాకిస్తాన్‌కి మింగుడుపడటం లేదు. యథావిధిగా ఈ హత్యల వెనక శతృదేశ గూఢాచర సంస్థ ఉందని పరోక్షంగా భారత్ నిఘా ఏజెన్సీ ‘ రా ’ని వ్యాఖ్యానించడం తప్పితే ఏం చేయలేకపోతున్నారు.

తాజాగా భారత దేశంలో సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్‌పై 2018లో ఉగ్రదాడికి వ్యూహకర్తగా వ్యవహిరించిన లష్కరే తోయిబా కమాండర్ ఖవాజా షాహిద్ అలియాస్ మియా ముజాహిద్ కిడ్నాప్ గురై, కుక్కచావు చచ్చాడు. ఐఎస్ఐ ఎంత వెతికినా ఇతని ఆచూకీ లభించలేదు. చివరకు తల నరికివేయబడిన స్థితిలో శవం దొరికింది. ఈ ఘటన ఎల్ఓసీకి సమీపంలోని పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే)లో జరిగింది. హత్యకు ముందు లష్కర్ ఉగ్రవాదిని దారుణంగా టార్చర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇతను పీఓకేలోని నీలం వ్యాలీలో ఉంటున్నాడు. అయితే ఇతన్ని ఎవరు చంపారనే దానిపై పాక్ ప్రభుత్వానికి ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా చంపినట్లు బాధ్యత వహించలేదు.

2018లో జమ్మూ కాశ్మీర్ లోని 36 బ్రిగేడ్ సుంజ్వాన్ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా మియా ముజాహీద్ ఉన్నాడు. ఈ టెర్రరిస్ట్ అటాక్‌లో పలువురు జవాన్లతో పాటు ఆరుగురు మహిళలు చనిపోయారు. తాజాగా పాక్‌లో హతమైన మియా ముజాహీద్ లష్కర్ తరుపున రిక్రూట్మెంట్లు, కాశ్మీర్ లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తుండే వాడు.

ఇటీవల కాలంలో పాకిస్తాన్ వ్యాప్తంగా భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదులే కాకుండా ఖలిస్తాన్ ఉగ్రవాదులను కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇప్పటి వరకు భారత వ్యతిరేక ఉగ్రవాదులు 18 మంది పాక్ గడ్డపై ఈ ఒక్క ఏడాదిలోనే ఖతమయ్యారు. గత నెలలో జైషే మహ్మద్ చీఫ్ మసూర్ అజహర్‌కి అత్యంత సన్నిహితుడైన దావూద్ మాలిక్‌ని నార్త్ వజీరిస్థాన్ లో గుర్తు తెలియని వ్యక్తులు చంపారు. కీలక లష్కర్ ఉగ్రవాది హఫీస్ సయీద్ సన్నిహితుడు, హిజ్బుల్ చీఫ్ అయిన ముఫ్తీ ఖైజర్ ఫారూఖీని కరాచీలో కాల్చి చంపేశారు. ఎయిరిండియా విమానం హైజాక్ లో కీలక పాత్ర పోషించిన జైషే ఉగ్రవాది మిస్త్రీ జహూర్ ఇబ్రహీం ను కూడా ఇలాగే చంపేశారు. లాహోర్ లో ఖలిస్తాన్ ఉగ్రవాది పరంజిత్ సింగ్ పంజ్వార్ ని కూడా చంపేశారు.