Leading News Portal in Telugu

South Korea: మనిషిని చంపిన రోబోట్..


South Korea: మనిషిని చంపిన రోబోట్..

South Korea: మనుషుల పనులను, జీవనశైలిని మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అయితే టెక్నాలజీ అనేది భవిష్యత్ తరాల్లో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పలువురు టెక్ దిగ్గజాలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇది భవిష్యత్ తరాల్లో మానవ మనుగడకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఇది మానవులకు మరింత సాయంగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ వాదనలు ఎలా ఉన్నా టెక్నాలజీ ఒక్కోసారి ప్రాణాలు తీసే అవకాశం ఉంటుందనే దానికి దక్షిణ కొరియాలో జరిగిన ఓ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఓ రోబో మనిషి ప్రాణాలను తీసేసింది. ఇండస్ట్రియల్ రోబో, తనను తనిఖీ చేయడానికి వచ్చిన వ్యక్తిని నలిపేసి చంపేసింది.

40 ఏళ్ల రోబోటిక్స్ కంపెనీ ఉద్యోగి, దక్షిణ జియోంగ్‌సాంగ్ ప్రావిన్సులోని వ్యవసాయ ఉత్పత్తులను పంపిణీ చేసే కేంద్రంలో రోబోట్ సెన్సార్ కార్యకలపాలను తనిఖీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. బెల్ పెప్పర్‌తో నింపిన పెట్టెలను ఎత్తి ప్యాలెట్‌పై పెట్టే పనిని ఈ రోబో నిర్వహిస్తోంది. అయితే తనిఖీ చేస్తున్న సందర్భంలో ఇండస్ట్రియల్ రోబోట్ వ్యక్తిని తప్పుగా పెట్టెగా భావించింది, దీంతో అతడిని నలిపేసినట్లుగా యోన్‌హాప్ పోలీసులు వెల్లడించారు. రోబోటిక్ చేయి వ్యక్తి పై భాగాన్ని కన్వేయర్ బెల్టుపై ఉంచి అతని ముఖాన్ని, ఛాతిని పచ్చడి చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు తెలిపారు.