
Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న వేళ జెరూసలెంలో విద్వేష ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల యువకుడు 20 ఏళ్ల మహిళా పోలీస్ అధికారిని కత్తితో పొడిచి చంపారడు. జెరూసలేంలో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఇజ్రాయిల్-అమెరికన్ సార్జెంట్ ఎలిషేవా రోజ్ ఇడా లుబిన్‌పై దాడి జరిగింది. ఘటనా సమయంలో లుబిన్ మరో ఇద్దరు అధికారులతో కలిసి జెరూసలేంలోని ఓల్డ్ సిటీలో పెట్రోలింగ్ చేస్తోంది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన లుబిన్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
ఈ దాడిలో మరో అధికారి గాయపడగా.. మూడో అధికారి దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసినట్లు ఇజ్రాయిల్ పోలీసులు వెల్లడించారు. దాడిని పాల్పడిన వ్యక్తిని పాలస్తీయన్‌గా గుర్తించారు. నిందితుడిని గుర్తించేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) శరణార్థి శిబిరాలపై రైడ్స్ చేసింది. దాడి చేసిన పట్టుకునే క్రమంలో ఐడీఎఫ్ బలగాలకు పాలస్తీనియన్లకు మధ్య ఘర్షణలు జరిగాయి. చివరకు దాడి చేసిన యువకుడిని బలగాలు కాల్చి చంపాయి.
చనిపోయిన అధికారిని లుబిన్ అమెరికాలోని అట్లాంటాలో నివసించేది. అయితే 2021లో ఇజ్రాయిల్‌కి వలస వచ్చింది. మార్చి 2022లో ఆర్మీ డ్యూటీలో భాగంగా ఇజ్రాయిల్ బోర్డర్ పోలీస్‌లో చేరింది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు దాడి జరిపిన ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతమైన కిబ్బట్జ్ సాద్‌లో ఈమె నివసిస్తోంది.
ఇదిలా ఉంటే గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ సైన్యం భీకరదాడులు చేస్తోంది. వైమానిక, భూతల దాడులను నిర్వహిస్తోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి ప్రవేశించి 1400 మందిని ఊచకోత కోశారు. దీని తర్వాత నుంచి ఇజ్రాయిల్, గాజాపై భీకరదాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 10 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.