Leading News Portal in Telugu

Israel: ఫిన్లాండ్‌కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని విక్రయించనున్న ఇజ్రాయిల్..



Israel Air Defense System

Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయిల్ పలు దేశాలకు తన ఆయుధాలను విక్రయిస్తోంది. ఇటీవల నాటోలో కొత్త సభ్యుడిగా చేరిన ఫిన్లాండ్ దేశానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయిల్ తన డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని ఫిన్లాండ్‌కి విక్రయించడానికి 340 మిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్నట్లు ఆదివారం ప్రకటించింది. దీనిని చారిత్రక ఒప్పందంగా ఇజ్రాయిల్ పేర్కొంది. ఇజ్రాయిల్, యూఎస్ కంపెనీలు కలిసి ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. క్రూయిజ్ క్షిపణలు, విమానాలు, డ్రోన్లను కూడా ఈ వ్యవస్థ అడ్డుకోగలదని ఇజ్రాయిల్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read Also: Team India Diwali Celebrations: దీపావళి సంబరాలు జరుపుకున్న టీమిండియా ఆటగాళ్లు.. వీడియో చూశారా..!

అంతకుముందు సెప్టెంబర్ నెలలో తన యూరో 3 హైపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థను జర్మనీకి విక్రయించడానికి 3.5 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది. తాజాగా ఫిన్లాండ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. లాంగ్ రేంజ్ యూరో 3 సిస్టమ్‌ని ఇజ్రాయిల్, దాని మిత్ర దేశం అమెరికా కంపెనీలు కలిసి సంయుక్తంగా డెవలప్ చేశాయి. గతేడాది ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత యూరప్‌లోని నాటో వైమానిక రక్షణను బలపరిచేందుకు జర్మనీ, ఇజ్రాయిల్‌తో ఈ డీల్ కుదుర్చుకుంది. మిత్రదేశాలతో కలిసి నిరోధక వ్యవస్థలను కొనుగోలు చేయాలని కోరడంతో ఈ ఒప్పందం జరిగింది.

కొత్తగా నాటోలో చేరిన ఫిన్లాండ్ కూడా విమానాలు, రాకెట్లు, క్షిపణులకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసే ప్రణాళికను ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న కారణంగా యూరోపియన్ యూనియన్‌లో ఇజ్రాయిల్ ఆయుధాలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.