Leading News Portal in Telugu

Bangladesh: జనవరి 7న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు..



Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో జనవరి 7న సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ ఎన్నికల సంఘం తెలిపింది. రిగ్గింగ్ అవుతుందనే భయంతో ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని బెదిరించాయని ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ బుధవారం తెలిపారు. బంగ్లాదేశ్ లోని 300 స్థానాలకు 12వ పార్లమెంటరీ ఎన్నికలు జనవరి 7న జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ హబీబుల్ అవల్ తెలిపారు. రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు పార్టీలు చర్చలు జరపాలని కోరారు.

దీనికి నిరసనగా గురువారం దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని ప్రతిపక్షాలు హెచ్చరించాయి. 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌ని ప్రధాని షేక్ హసీనా 15 ఏళ్లుగా పాలిస్తు్న్నారని, నియంతృత్వంలో పరిపాలన కొనసాగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిపక్షాల బహిష్కరణ కొనసాగితే ఆమె నాలుగోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Read Also: Jammu Kashmir: చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల హతం..

హసీనా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇస్లామిక్ ర్యాడికలైజేషన్‌ని అణిచివేస్తోంది. దీంతో పాటు బంగ్లా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం గత రెండు ఎన్నికల్లో ఆమె ఓట్లు రిగ్గింగ్ చేసి గెలించిందని ఆరోపిస్తున్నాయి. ఆమె రాజీనామా చేసి తటస్థ ఆపద్ధర్మ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రతిపక్షాలు భారీ ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఈ నిరసనలను కారణమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)కి చెందిన చాలా మంది అగ్రనేతలను, వేలాది మంది నిరసనకారుల్ని హసీనా ప్రభుత్వం జైళ్లలో వేసింది.

ఇదిలా ఉంటే అధికార అవామీ లీగ్ ఎన్నికల తేదీని ప్రకటించడాన్ని ఆనందకరమైన రోజుగా అభివర్ణించింది. బీఎన్పీ మాత్రం ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించింది. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్ లో అతిపెద్ద ఇస్లామిక్ పార్టీ అయిన జమాతే ఇస్లామా, ఇస్లామీ ఆందోళన్ బంగ్లాదేశ్(ఐఏబీ) పార్టీ ఇలాగే హసీనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

అరెస్టుకు భయపడి అజ్ఞాతంలో ఉన్న బీఎన్పీ పార్టీ అధికార ప్రతినిధి రుహూల్ కబీర్ రిజ్వీ ఎన్నికలను తిరస్కరిస్తున్నట్లు ఆన్ లైన్ వీడియోలో వెల్లడించారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరుగుతాయన్నది పూర్తి అబద్ధమని, ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహిస్తోందని ఆయన ఆరోపించారు. బుధవారం వేలాది మంది ఐఏపీ మద్దతుదారులు ఎన్నికల సంఘాన్ని ముట్టడించారు. బంగ్లాదేశ్ లో అమెరికా రాయబారి పీటర్ హాస్ రాజకీయ ప్రతిష్టంభన తొలగించే ప్రయత్నంలో భాగంగా మూడు పార్టీ నాయకులతో సమావేశాలకు పిలుపునిచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ ఎన్నికల ప్రకటన వెలువడింది.