
HIV- Hepatitis: అమెరికాలో ఓ ఆస్పత్రి నిర్వాకం వల్ల 450 మంది రోగులు ప్రాణాంతక హెచ్ఐవీ, హెపటైటిస్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఏర్పడింది. కొంతకాలంగా సదరు ఆస్పత్రిలో ఎండోస్కోపీ చేయించుకుంటున్న రోగులు ఈ రిస్క్ బారిన పడ్డారు. ఎండోస్కోపీ విధానంలో శరీరంలోనికి పంపే ట్యూబుతో కూడిన పరికరం ఇందుకు కారణమైందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎండోస్కోపీ పరికరంలో లైట్, కెమెరా అమర్చి ఉంటాయి. ఇవి కడుపులోని భాగాలను పరిశీలించి రోగ నిర్థారణ చేసేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఎండోస్కోపీ ట్యూబు ఈ ప్రాణాంతక వ్యాధులకు ఎందుకు కారణమైందనే విషయాన్ని ఆస్పత్రి వర్గాలు స్పష్టత ఇవ్వలేదు.
అమెరికా మసాచుసెట్స్‌లోని సాలెం హాస్పిటల్ ఈ విషయాన్ని గుర్తించింది. తాము ఎండోస్కోపీ విధానం చేస్తున్న క్రమంలో నిర్వహణ తప్పిదం వల్ల రోగులు ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు నిర్థారించాయి. ముఖ్యంగా జూన్ 2021 నుంచి ఏప్రిల్ 2023 వరకు రెండేళ్ల కాలంలో ఎండోస్కోపీ చేయించుకున్న 450 మంది రోగులు హెచ్ఐవీతో పాటు హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ వంటి లివర్ సంబంధిత ప్రాణాంతక రోగాలకు గురయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉన్నత ప్రమాణాల మేరకు తమ ఆస్పత్రి వైద్య సేవలు అందించకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది.
ఈ విషయాన్ని ఇప్పటికే సదరు రోగులకు తెలియజేసినట్లు సాలెం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ తప్పుకి క్షమాపణలు కూడా చెప్పాయి. అయితే ఈ వ్యాధులు సంక్రమించే ముప్పు తక్కువే అని తెలిపింది. సంబంధిత రోగులకు ఈ విషయాన్ని ఫోన్, ఈ మెయిల్ ద్వారా వెల్లడించినట్లు తెలిపింది. అప్పటి నుంచి వారికి మూడు పరీక్షలు క్రమంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇన్ఫెక్షన్ల బారిన పడినట్లు నిర్థారణ కాలేదని సాలెం ఆస్పత్రి అధికార ప్రతినిధి వెల్లడించారు. దీనిపై మసాచుసెట్స్ ప్రజారోగ్య విభాగం స్పందించింది. ఈ వ్యాధుల బారినపడే ముప్పు తక్కువే అని, దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిపింది.