Leading News Portal in Telugu

Israel-Hamas War: బందీల విడుదలపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయి.. ఖతార్ వెల్లడి..



Israel Hamas War

Israel-Hamas War: ఇజ్రాయిల్, హమాస్ మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైన యుద్ధం భీకరంగా సాగుతోంది. హమాస్ ఉగ్రవాదుల రాకెట్ల ద్వారా ఇజ్రాయిల్‌పై దాడి చేయడమే కాకుండా, ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1200 మందిని ఊచకోత కోశారు. 240 మందిని అపహరించి గాజాలోకి బందీలుగా తరలించారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్ లోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 13,300 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చాలా మంది చిన్నారులు ఉండటంతో ప్రపంచదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి పిలుపునిస్తున్నాయి.

అయితే, బందీల విడుదలపై ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. పట్టుబడిన బందీలను విడిపించేందుకు చర్చలు తుది దశకు చేరుకున్నాయి ఖతార్ మంగళవారం తెలిపింది. ‘‘మేము ఒక ఒప్పందాన్ని చేసుకునేందుకు దగ్గరగా ఉన్నామని, చర్చలు క్లిష్టమైన, చివరి దశకు చేరుకున్నాయి’’ అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేద్ అల్ అన్సారీ చెప్పారు.

Read Also: Covid-19 Vaccination: “ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు”.. టాప్ మెడికల్ బాడీ వెల్లడి..

తాత్కాలిక కాల్పుల విరమణకి పిలుపునిస్తే అందుకు ప్రతిఫలంగా 240 మంది బందీల్లో కొందర్ని విడిపించేందుకు ఖతార్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఇప్పటి వరకు బందీల్లో నలుగురిని మాత్రమే హమాస్ విడుదల చేసింది. అయితే ఇటీవల అమెరికన్ మీడియా వాషింగ్టన్ పోస్టు.. ఇజ్రాయిల్, హమాస్ మధ్య ఒప్పందం కుదిరినట్లు నివేదించింది. ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఇజ్రాయిల్, అమెరికా తెలిపింది. ఈ నేపథ్యంలో హమాస్ అధిపతి ఇస్మాయిల్ హనియా కూడా.. ఇజ్రాయిల్‌తో సంధికి చేరువవుతున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గాజాలో మానవతా సాయం నిమిత్తం యుద్ధంలో కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలను ఐక్యరాజ్యసమితిలో భారత్ స్వాగతించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దానిని భారత్ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి, శాంతియుత పరిస్థితులను నెలకొనే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చింది, అలాగే బందీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.