Leading News Portal in Telugu

Israel-Hamas War: రెండో విడతగా 14 మంది బందీలను విడుదల చేయనున్న హమాస్..


Israel-Hamas War: రెండో విడతగా 14 మంది బందీలను విడుదల చేయనున్న హమాస్..

ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఒప్పందంలో భాగంగా ఇరు వర్గాలు తమ వద్ద ఉన్న బందీలను మార్చుకుంటున్నాయి. అక్టోబర్ 7న హమాస్ అపహరించుకుని బందీలుగా తీసుకెళ్లిన వారిలో కొంతమందిని శుక్రవారం నుంచి విడుదల చేయడం ప్రారంభించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ కూడా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది. శుక్రవారం రోజున 24 మందిని హమాస్ మొదటి విడతగా విడుదల చేయగా.. శనివారం మరో 14 మందిని రెండో విడతలో హమాస్ విడుదల చేయనుంది. వీరిని ఇజ్రాయిల్‌కి అప్పగించాలని హమాస్ భావిస్తోంది. దీనికి బదులుగా 42 మంది ఖైదీలను ఇజ్రాయిల్ విడుదల చేయనుంది. శుక్రవారం విడుదల చేసిన వారిలో 13 మంది ఇజ్రాయిలీలతో సహా థాయ్‌లాండ్ దేశస్తులు కూడా ఉన్నారు. మొత్తంగా తొలి విడతలో 24 మంది బందీలు హమాస్ చెర నుంచి విముక్తులయ్యారు.

ఖతార్, ఈజిప్టు దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి కుదిరింది. నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయిల్ అంగీకరించింది. దీంట్లో భాగంగా హమాస్ తన వద్ద ఉన్న బందీలను విడుదల చేస్తోంది, మరోవైపు ఇజ్రాయిల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని డీల్ కుదిరింది.

హమాస్ మొత్తం 50 మంది బందీలను విడుదల చేస్తామని చెప్పింది. మిగిలిన వారిని ఆది, సోమవారాల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 7 రోజున ఇజ్రాయిల్‌పై హమాస్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1200 మందిని చంపడమే కాకుండా.. 240 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. హమాస్ చేతిలో ఉన్న 200 మందికి పైగా బందీలను విడుదల చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హామీ ఇచ్చారు.