
Pakistan: తాలిబాన్ల వేధింపుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ వదిలి పాకిస్తాన్ దేశంలోకి శరణార్థులుగా వెళ్లిన వారి పరిస్థితి దారుణంగా మారింది. పాకిస్తాన్, తమ దేశం విడిచివెళ్లాలని ఆఫ్ఘన్ శరణార్థులకు డెడ్‌లైన్ విధించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేక రైడ్స్ నిర్వహించి శరణార్థులను గుర్తిస్తోంది. చాలా ఏళ్లుగా పాకిస్తాన్ లో స్థిరపడిన ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు ఇళ్లు, వ్యాపారం ఇలా అన్నింటిని వదిలేసి మళ్లీ ఆప్ఘనిస్తాన్ వెళ్తున్నారు.
ఇదిలా ఉంటే సొంత దేశానికి వెళ్తున్న ఆప్ఘన్లను పాకిస్తాన్ దోచుకుంటోంది. శరణార్థుల ఎగ్జిట్ ఫీజు కింద పాకిస్తాన్ వారి నుంచి వందలాది డాలర్లను వసూలు చేస్తోంది. పాకిస్తాన్ తీరుపై పాశ్చాత్య దేశాలు, ఐక్యరాజ్యసమితి విమర్శలు గుప్పిస్తోంది. ప్రతీ శరణార్థి నుంచి 830 డాలర్లను(సుమారుగా రూ.69000) రుసుముగా వసూలు చేస్తోంది. సరైన పత్రాలు లేని శరణార్థులను పాకిస్తాన్ అణిచివేస్తోంది. దీంతో 20 లక్షల మంది ఆఫ్ఘన్లు దేశం వదిలివెళ్లేందుకు నవంబర్ 1న డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. గడువు ముగియడంతో పాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్నారు. ఆగస్టు 2021లో కాబూల్ లో ప్రజా ప్రభుత్వం పతనమై తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఆప్ఘనిస్తాన్ జాతీయులు పత్రాలు లేకుండా పాకిస్తాన్ వచ్చి స్థిరపడ్డారు.
25,000 మంది ఆఫ్ఘన్లకు పునరావాసం కల్పించాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది, 20,000 మందికి పునరావాసం కల్పిస్తామని యూకే చెప్పింది. పాకిస్తాన్ అత్యంత దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉంది. అయితే ఇలా శరణార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం మంచి పద్దతి కాదని పాక్‌లోని పాశ్చాత్య దేశాల దౌత్యవేత్తలు విమర్శించారు. అయితే ముందుగా ప్రతీ శరణార్థి నుంచి 10,000 డాలర్లు వసూలు చేద్ధామని అనుకున్నారు, అయితే దీన్ని 830 డాలర్లకు తగ్గించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
పాకిస్తాన్లో ఇటీవల ఉగ్రవాద సంఘటనలు ఎక్కువయ్యాయి. ప్రముఖ ఉగ్రవాదులతో పాటు పాక్ తాలిబాన్లు, మరోవైపు బలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పాక్ పోలీసులు, సైన్యం, చైనా జాతీయులపై దాడులకు తెగబడుతున్నారు. బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో నిత్యం ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి. అయితే వీటి వెనక ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు ఉన్నట్లు పాక్ ఆరోపిస్తోంది. ఇటీవల జరిగిన అన్ని ఉగ్రదాడుల్లో ఆఫ్ఘన్ జాతీయులు హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చినట్లు పాక్ అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే దేశంలో అక్రమంగా ఉంటున్న ఆఫ్ఘన్ జాతీయులను తరిమికొడుతున్నారు.