Leading News Portal in Telugu

Elon Musk: జనవరిలో ఇండియాకు ఎలాన్ మస్క్..?


Elon Musk: జనవరిలో ఇండియాకు ఎలాన్ మస్క్..?

Elon Musk: వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్లా, భారత ప్రభుత్వం మధ్య చర్చలు తుది దశకు వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి భారత్ లోకి టెస్లా కార్లు దిగమతి కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు టెస్లా సిద్ధమైంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లోని ఏదో చోట ప్లాంట్ నెలకొల్పనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి సంబంధించి ఎకో సిస్టమ్ ఉంది.

ప్రస్తుతం టెస్లాకు అమెరికా బయట జర్మనీ, చైనాలో మాత్రమే ప్లాంట్స్ ఉన్నాయి. అయితే పెట్టుబడి పెట్టే విషయంలో టెస్లా ఓ కండిషన్ పెట్టినట్లు వినికిడి. వచ్చే రెండేళ్లలో దిగుమతి చేసుకునే వాహనాలపై 15 శాతం రాయితీ సుంకాన్ని తగ్గించాలని భారత ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి భారత్ అంగీకరిస్తే, ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు టెస్లా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జూన్ నెలలో ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌‌తో భేటీ అయ్యారు. ఎలాన్ మస్క్ భారత్ లో టెస్లా లాంచ్‌ని ప్రారంభించేందుకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి నెలలో జరిగే వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా ఎలాన్ మస్క్ భారత్ సందర్శించే అవకాశం ఉంది.

గతేడాది భారతదేశంలో 50,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే ఈ ఏడాది లక్ష దాటే అవకాశం ఉంది. 140 కోట్ల మంది ఉన్న అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌ని సద్వినియోగం చేసుకోవాలని టెస్లా ఉంది. కానీ సుంకాలు ఎక్కువగా ఉండటంపై టెస్లా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

టెస్లా 12,000 వాహనాలకు రాయితీ టారిఫ్ ప్రకటిస్తే 500 మిలియన్ల పెట్టుబడి, 30,000 వాహనాలపై దిగుమతి సుంకాలు తగ్గిస్తే 2 బిలియన్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అయితే 2023లో అంచనా వేస్తున్న ఒక లక్ష వాహనాల్లో 10 శాతం అంటే 10,000 వాహనాలకు సుంకాలను తగ్గించాలని భారత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.