
Iran:ఇస్లామిక్, షరియా చట్టాలను పాటించే అరబ్ దేశాల్లో నేరాలకు కఠినమైన శిక్షలు ఉంటాయి. అత్యాచారం, డ్రగ్స్ వినియోగం, హత్య వంటి నేరాలకు ఉరిశిక్ష విధిస్తుంటారు. తాజాగా ఓ 17 ఏళ్ల యువకుడికి ఇరాన్ ఉరిశిక్ష అమలు చేసింది. మైనర్ చేసిన నేరానికి ఉరిశిక్ష విధించడాన్ని హక్కుల సంఘాలు శనివారం తీవ్రంగా ఖండించారు. ఓ ఘర్షణలో మరో వ్యక్తిని హత్య చేసింనందుకు మైనర్‌కి మరణశిక్ష విధించింది.
హమీద్రేజా అజారీ అనే వ్యక్తి రజావి ఖోరాసన్ ప్రావిన్స్‌లోని సబ్జేవర్‌లోని జైలులో ఉరితీసినట్లు శుక్రవారం నార్వేకి చెందిన హెంగావ్, ఇరాన్ మానవ హక్కుల గ్రూపులు తెలిపాయి. అజారీ అతని కుటుంబంలో ఏకైక సంతానమని ఇరాన్ ఇంటర్నేషనల్ ఛానెల్ కూడా ఉరిశిక్షను నివేదించింది. నేరం జరిగిన సమయంలో అతని వయసు 16 ఏళ్లని, ఏడాది తర్వాత అతడిని ఉరితీశారు. మే నెలలో ఓ ఘర్షణలో మరో వ్యక్తిని చంపినందుకు మరణశిక్ష విధించారు.
18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిని బాలలుగా గుర్తించే అంతర్జాతీయ మానవహక్కుల నియమాలను ఇరాన్ ఉల్లంఘించినట్లు మానవహక్కుల సంఘాలు పేర్కొన్నాయి. బాలలకు శిక్షలు విధించే అతికొద్ది దేశాల్లో ఇరాన్ ఒకటి. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇరాన్ అత్యధికంగా మరణశిక్షలు విధిస్తోంది, బాల నేరస్తులను ఉరితీస్తుంది. హక్కుల సంస్థల డేటా ప్రకారం.. 2010 నుంచి ఇరాన్ కనీసం 68 మంది మైనర్లను ఉరితీసింది.
గతేడాది కుర్దిష్ యువతి మహ్సా అమినిని హిజాబ్ సరిగా ధరించలేదని చెబుతూ అక్కడి మోరల్ పోలీసులు దాడి చేయడంతో ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. ఈ అల్లర్లలో పాల్గొన్న కొందర్ని ఇరాన్ వరసగా ఉరితీస్తూ వస్తోంది. ఈ అల్లర్లతో సంబంధం ఉన్న ఎనిమిదో వ్యక్తిని ఇరాన్ గురువారం ఉరితీసింది. ఇరాన్‌లో ఈ ఏడాది 684 మందికి మరణశిక్ష విధించారు. ఎక్కువగా డ్రగ్స్, హత్యల నేరాలకు ఎక్కువ మంది శిక్షల్ని అనుభవించారు.