Leading News Portal in Telugu

Israel-Palestine: ఇజ్రాయిల్‌కి సహకరించిన ముగ్గురిని బహిరంగంగా ఉరితీసిన పాలస్తీనా..


Israel-Palestine: ఇజ్రాయిల్‌కి సహకరించిన ముగ్గురిని బహిరంగంగా ఉరితీసిన పాలస్తీనా..

Israel-Palestine: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్ దారుణానికి ఒడిగట్టింది. ఇజ్రాయిల్ సైనికులకు సహకరించారనే నెపంతో ముగ్గురు పాలస్తీనా పౌరుల్ని బహిరంగంగా ఉరి తీశారు. ఇజ్రాయిల్‌కి సహకరించినందుకు వెస్ట్‌బ్యాంక్ ప్రాంతంలో ఈ హత్యలు జరిగాయి. తుల్కర్మ్‌లో రెండు మృతదేహాలను విద్యుత్ స్తంభానికి వేలాడదీశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తుల్కర్మ్‌లో హత్యకు గురైన ఇద్దరు వ్యక్తులు హంజా ముబారక్(31), అజం జుబ్రా(29) అని ఇజ్రాయిల్‌కి చెందిన ఎన్12 వార్తా ఛానెల్ గుర్తించింది. జెనిన్‌లో మూడో వ్యక్తిని హతమార్చినట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది. మీరు దేశద్రోహులు, మీరు గూఢాచారులు అంటూ గుంపు నినాదాలు చేస్తుండగా, వీరిని ఉరితీశారు. హమాస్, ఇస్లామిక్ జిహాద్ ఉగ్రసంస్థలకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు చనిపోవడానికి అవసరమైన సమాచారాన్ని ముగ్గురు వ్యక్తుల ఇజ్రాయిల్ సైన్యానికి ఇచ్చారని ఉరితీశారు.

ఇజ్రాయిల్ సైన్యానికి సాయం చేసినందుకు తమకు డబ్బలు అందినట్లు ఓ వ్యక్తి వీడియో రికార్డింగ్‌లో ఒప్పుకున్నాడు. ఇన్‌ఫార్మర్లకు, దేశద్రోహికి ఎలాంటి రక్షణ ఉండదని, మా యోధుల హత్యల్లో ఎవరి ప్రమేయమైనా ఉందని రుజువైతే అతడికి వెంటనే మరణశిక్ష విధిస్తామని రెసిస్టెన్స్ సెక్యూరిటీ అనే సంస్థ ఉరిశిక్షల గురించి వ్యాఖ్యానించింది.

అక్టోబర్7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడ్డారు. దాదాపుగా 1200 మందిని క్రూరంగా చంపేశారు. మరో 240 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 13 వేల మంది పైగా పాలస్తీనియన్లు మరణించారు. తాజాగా ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో నాలుగు రోజుల పాటు ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఒప్పందం జరిగింది. ప్రస్తుతం హమాస్ చెరలో ఉన్న 50 మంది బందీలను విడుదల చేయనుంది. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది.