
Ship Sink: 14 మంది వ్యక్తులతో వెళ్తున్న కార్గో షిప్ గ్రీస్ సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. లెస్బోస్ ద్వీపం సమీపంలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు గ్రీక్ కోస్ట్ గార్డ్స్ తెలిపారు. బలమైన ఈదురుగాలుల కారణంగానే షిప్ మునిగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం 14 మంది సముద్రంలో గల్లంతయ్యారు. వీరి కోసం ఐదు కార్గో షిప్‌లు, మూడు తీర రక్షక నౌకలు, వైమానిక దళం మరియు నేవీ హెలికాప్టర్‌లతో పాటు నేవీ ఫ్రిగేట్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
ఆదివారం తెల్లవారుజామున లెస్బోస్‌కి నైరుతి దిశలో 4.5 నాటికమ్ మైళ్లు(8.3 కిలోమీటర్లు) మునిగిపోయినట్లు కోస్ట్ గార్డు చెప్పారు. ఈ ఓడ ఈజిప్టులోని దేఖీలా నుంచి ఇస్తాంబుల్ బయలుదేరింది. 14 మంది సిబ్బందిలో ఇద్దరు సిరియా, 8 మంది ఈజిప్ట్, నలుగురు భారత్‌కి చెందిన పౌరులు ఉన్నారు. గాలి వేగం తీవ్రంగా ఉండటంతో శనివారం గ్రీస్ లోని అనేక ప్రాంతాల్లో నౌకలు పోర్టులకే పరిమితమయ్యాయి. తుఫాన్ ఆలివర్ అడ్రియాటిక్ సముద్రం నుంచి గ్రీస్ వైపు కదులుతున్నందున గ్రీస్ వాతావరణశాఖ హెచ్చరిలకను జారీ చేసింది.