
టాంజానియా దేశంలో పెను ప్రమాదం తప్పిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే రోజు ఒకే విమానాశ్రయంలో రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. అది కూడా కేవలం ఒక్క గంట వ్యవధిలోనే రన్‌వే పై అదుపు తప్పిపోయాయి. అయితే, ఈ రెండు సంఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ది ఇండిపెండెంట్ రిపోర్ట్ ప్రకారం.. టాంజానియాలోని కికోబోగా విమానాశ్రయంలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ముందుగా యునైటెడ్ ఎయిర్ జాంజిబార్ ఫ్లైట్ 30 మంది ప్రయాణికులతో పాటు ముగ్గురు సిబ్బందితో బయల్దేరింది. ఈ క్రమంలో కికోబోగా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానం రన్ వేను తాకగానే ల్యాండింగ్ గేర్ ఊడిపోయింది.. దీంతో ఫ్లైట్ రన్ వే పై కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఫ్లైట్ బాగా డ్యామేజ్ అయింది.. కానీ, ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
అలాగే, ఉదయం జరిగిన ఈ ప్రమాదం నుంచి ఎయిర్ పోర్ట్ సిబ్బంది తేరుకోక ముందే.. మరో యాక్సిడెంట్ జరిగింది. మొదటి ప్రమాదం జరిగిన దాదాపు ఆరు గంటల తర్వాత కికోబోగా ఎయిర్పోర్ట్ నుంచి జాంజిబార్ వెళ్లేందుకు మరో ఫ్లైట్ రెడీ అయింది. 30 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బందితో జాంబిజార్ వెళ్లేందుకు సిద్ధం అయింది. అయితే, రన్ వే పై స్పీడ్ అందుకున్నాక గాల్లోకి లేవాల్సిన విమానం అదుపుతప్పి రన్ వే చివర్లో ఉన్న ఓ బిల్డింగ్‌ను గట్టిగా ఢీ కొట్టింది.. దీంతో ఈ ప్రమాదంలో కూడా విమానం పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటన తర్వాత సంఘటన స్థలి దగ్గర భారీగా పొగలు వచ్చాయి. ఈ సంఘటనలోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు అని అధికారులు తెలిపారు. రెండు ప్రమాదాలకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
BREAKING: Two Embraer EMB 120 Brasilia planes crash in Tanzania on the same day at the same airport after problems with their landing gear
— Insider Paper (@TheInsiderPaper) November 29, 2023