
Vivek Ramaswamy: వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరుపున ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తు్న్నారు. గురువారం సీఎన్ఎన్ టౌన్ హాల్‌లో వివేక్ రామస్వామిని ఒక ఓటర్ హిందూ విశ్వాసాల గురించి ప్రశ్నించింది. దీనికి రామస్వామి చెప్పిన జవాబు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
‘‘ మన దేశాన్ని స్థాపించిన వారితో మీ మతం ఏకీభవించనందున మీరు మా అధ్యక్షుడిగా ఉండలేరు అని వాదించే వారికి మీరు ఎలా స్పందిస్తారు..?’’ అని అయోవా ఓటర్ గన్నీ మిచెల్ ప్రశ్నించారు. అయితే దీనికి సమాధానంగా వివేక్ రామస్వామి మాట్లాడుతూ..‘‘ నేను హిందువును, నా గుర్తింపును నేను దాచిపెట్టను. హిందూమతం, క్రైస్తవం ఒకే విలువను కలిగి ఉన్నాయి’’ అని సమాధానం ఇచ్చారు. నా మత విశ్వాసాల ఆధారంగా ప్రతీ ఒక్కరు ఇక్కడ ఉన్నారని నేను అర్థం చేసుకున్నానని, ఆ కారణాన్ని నెరవేర్చడం అందరి బాధ్యత, ఎందుకంటే దేవుడు మనలోని ప్రతీ ఒక్కరిలో ఉన్నాడు, దేవుడు మన ద్వారా వివిధ మార్గాల్లో పనిచేస్తున్నప్పటీకి, మనమంతా సమానం అని చెప్పారు.
క్రైస్తవం, హిందూమతంలోని సాధారణ అంశాల గురించి మాట్లాడారు. ‘‘ నా పెంపకం చాలా సంప్రదాయంగా జరిగింది, వివాహాలు చాలా పవిత్రమైనవని, వివాహానికి ముందు సంయమనం పాటించడం ఆచరణీయమైన ఎంపిక, అని తన తల్లిదండ్రులు నేర్పించారు.’’ అని చెప్పారు. ఈ దేశం ద్వారా క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి నేను ఉత్తమ అధ్యక్షుడిననే దానికి నేను సరైన ఎంపిక కాదని ఒప్పుకోవడంతో పాటు.. అమెరికా స్థాపించబడిన విలువల కోసం నిలబడతా అని చెప్పారు. నవంబర్ 5, 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.