Leading News Portal in Telugu

Nawaz Sharif: భారత్ చంద్రున్ని చేరుకుంటే.. పాకిస్తాన్ భూమిపై నుంచి లేవడమే లేదు..


Nawaz Sharif: భారత్ చంద్రున్ని చేరుకుంటే.. పాకిస్తాన్ భూమిపై నుంచి లేవడమే లేదు..

Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నవాజ్, నాలుగోసారి పాకిస్తాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని అనుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా యూకేలో ప్రవాసంలో ఉన్న నవాజ్ షరీఫ్ ఇటీవలే పాకిస్తాన్ తిరితగి వచ్చారు. తన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) తరుపున ప్రచారం చేస్తున్నారు.

బుధవారం ఇస్లామాబాద్‌లో తన పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మన చుట్టుపక్కల దేశాలు చంద్రున్ని చేరుకుంటున్నాయని, పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ భూమి పై నుంచి లేవలేదని అన్నారు. పాకిస్తాన్ పతనానికి పాకిస్తానే కారణమని చెప్పారు. మన పతానానికి మనమే బాధ్యులమని.. లేకుంటే దేశం వేరే విధంగా ఉండేదని ఆయన అన్నారు.

2013లో పాకిస్తాన్ తీవ్రమైన విద్యుత్ సమస్యను ఎదుర్కొందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్యుత్ సమస్యలు తగ్గాయని, ఉగ్రవాదాన్ని అణిచివేశామని, కరాచీలో హైవేలు నిర్మించామని, సీపెక్ ఒప్పందం కుదిరిందని తన హాయాంలోని పాలన గురించి చెప్పుకున్నారు. 1993, 1999, 2017లో పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు. మూడుసార్లు కూడా పదవీకాలం ముగియకముందే పదవి నుంచి దించేయబడ్డాడు. తన హయాంలో భారత్‌తో సంబంధాలు బాగుండేవని చెప్పారు. కార్గిల్ యుద్ధం తనకు తెలియకుండా జరిగిందని వెల్లడించారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలోనే భారత ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేంద్రమోడీలు పాకిస్తాన్ సందర్శించారని చెప్పుకున్నారు.