
Balochistan: పాకిస్థాన్ కు వ్యతిరేకంగా అమెరికాలోని వైట్ హౌస్ ముందు బలూచిస్థాన్ వలసదారులు ఆందోళనకు దిగారు. గత 75 ఏళ్లలో బలూచిస్థాన్‌లో జరిగిన అకృత్యాలకు వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని బలూచిస్థాన్ అసెంబ్లీ మాజీ స్పీకర్ వహీద్ బలోచ్ నిరసన వ్యక్తం చేశారు. కిడ్నాప్‌కు గురైన బలూచిస్థాన్ కు చెందిన పలు కుటుంబాలకు మద్దతుగా ఇక్కడ నిరసన తెలుపుతున్నామన్నారు. గత 75 ఏళ్లుగా పాకిస్థాన్ బలూచిస్థాన్‌ను బలవంతంగా ఆక్రమించింది అని ఆయన ఆరోపించారు. అయితే, పాకిస్థాన్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల గురించి ఆయనను ప్రశ్నించగా.. ఎప్పుడూ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా అక్కడ ఎన్నికలు జరగలేదన్నారు.
అయితే, బలూచిస్థాన్ ప్రజలకు భారత ప్రభుత్వం సాయం చేస్తోందని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ వాదనను బలుచీ మాజీ స్పీకర్ వహీద్ పూర్తిగా తోసిపుచ్చారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ అబద్ధాలు చెప్తుందని అన్నారు. వైట్‌హౌస్ వెలుపల జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న యువ బలూచ్ నిరసనకారుడు సమ్మీ బలోచ్ మాట్లాడుతూ బలూచ్ ప్రజలకు ఏది జరిగినా అది దారుణమని, మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. తమ దేశాన్ని పూర్తిగా అక్రమించుకోవాలని పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను తరిమికొట్టాలని కోరారు.