
First Gay Prime Minister: ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 34 ఏళ్ల విద్యా శాఖ మంత్రి గాబ్రియేల్ అట్టల్‌ను మంగళవారం తన కొత్త ప్రధాన మంత్రిగా నియమించారు. దేశ ప్రధాని పోస్టుకు తొలిసారిగా గే (స్వలింగ సంపర్కుడు) వర్గానికి చెందిన 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్ పేరును మంగళవారం ప్రతిపాదించారు. దీంతో ప్రధాని పదవిని గాబ్రియేల్ అట్టల్ చేపట్టడం దాదాపు ఖరారైంది. త్వరలోనే అధికారిక లాంఛనాలతో ఆయన ప్రధాని పోస్టును చేపడతారు. ఇంత పిన్న వయస్కుడు ఫ్రాన్స్ ప్రధాని కానుండటం ఇదే తొలిసారి. ప్రధాని కాబోతున్న అట్టల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఇంతకుముందు వరకు దేశ ప్రధానిగా వ్యవహరించిన ఎలిజబెత్ బోర్న్(62) సోమవారం రోజే ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు రాజీనామా సమర్పించారు. ఈ ఏడాది జూన్‌లో యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండోసారి కూడా ఎన్నికల్లో గెలవాలనే సంకల్పంతో మాక్రాన్ ఉన్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసేందుకు రెడీ అవుతున్నారు. తన ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కొత్త మంత్రివర్గం కూర్పుతో బదులివ్వాలని ఆయన భావిస్తున్నారు.
ఎలిజబెత్ బోర్న్ రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలమే ప్రధాని పదవిలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం ఉండగా, అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దాంతో, ఫ్రాన్స్ ప్రధానిగా గాబ్రియేల్ అట్టల్ను నియమించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ఆయనకు దేశాధ్యక్షుడు మాక్రాన్ అప్పగించారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్రాన్స్ రినాయజెన్స్ పార్టీ నాయకుడు సిల్వైన్ మైలార్డ్ గాబ్రియేల్ అట్టల్‌ను అభినందించారు, “మీరు మీ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించగలరని, దేశ విలువలను ప్రతిబింబించగలరని నేను భావిస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.