Leading News Portal in Telugu

Taiwan: చైనాకి గట్టి దెబ్బ.. తైవాన్ ఎన్నికల్లో లై చింగ్-తే విజయం..


Taiwan: చైనాకి గట్టి దెబ్బ.. తైవాన్ ఎన్నికల్లో లై చింగ్-తే విజయం..

Taiwan: ప్రపంచ వ్యాప్తంగా తైవాన్ అధ్యక్ష ఎన్నికలు ఆసక్తిని పెంచాయి. చైనా, తైవాన్‌ని సొంతం చేసుకోవాలని కుయుక్తులు పన్నుతున్న వేళ, చైనాకు ట్రబుల్ మేకర్‌గా పేరుపొందిన అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) నేత లై చింగ్-తే విజయం సాధించారు. వరసగా మూడో సారి అక్కడి ప్రజలు ఈ పార్టీకే అధికారాన్ని కట్టబెట్టారు. ఈ గెలుపుతో చైనాకు గట్టి దెబ్బతాకినట్లు అయింది. ఎన్నికల సమయంలో లై చింగ్‌‌ని చైనా ప్రమాదకరమైన వేర్పాటువాదిగా నిందించింది. అయినా కూడా తైవాన్ ఓటర్లు లై కే మొగ్గు చూపారు. తైవాన్, చైనాలో భాగమే అని డ్రాగన్ కంట్రీ చేస్తున్న వాదనను లై చింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.


గత ప్రభుత్వంలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న లై, ఇప్పుడు అధ్యక్షుడు కాబోతున్నారు. అధ్యక్ష పదవి కోసం డీపీపీ నుంచి లై చింగ్ పోటీ చేయగా.. చైనా అనుకూల పార్టీగా పేరున్న ప్రతిపక్ష కువోమింగ్‌తాంగ్ పార్టీ తరుపున హూ యు ఇన్, తైవాన్ పీపుల్స్ పార్టీ నుంచి కో వెన్ జి అధ్యక్ష బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తైవాన్‌కి కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో పాటు 113 చట్ట సభ్యులను ప్రజలు ఎన్నుకున్నారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షాలు తమ ఓటమిని అంగీకరించాయి.

ప్రతిపక్ష పార్టీ కువోమింగ్‌తాంగ్ పార్టీ, ఎన్నికల్లో గెలిపిస్తే లైచింగ్ తేని గెలిపిస్తే తైవాన్‌లో అశాంతికి దారి తీస్తుందని ప్రజల్ని హెచ్చరించింది. మరోవైపు లై చింగ్ తే మాట్లాడుతూ.. తైవాన్ జలసంధి అంతటా శాంతి, యథాతథ స్థితిని పరిరక్షించడానికి, ద్వీప భద్రతను పెంచడానికి తాను కృ‌షి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పట్ల మన నిబద్ధతకు నిదర్శనమని లై చింగ్ తే అక్కడి మీడియాతో అన్నారు. ఈ ఎన్నికల్లో చైనా జోక్యాన్ని ఖండించారు. మరోవైపు ప్రతిపక్ష కువోమింగ్‌తాంగ్ పార్టీ గెలిస్తే వారిని అడ్డుపెట్టుకుని తైవాన్‌ని కంట్రోల్ చేయవచ్చని అనుకున్న చైనా ఆశలు అడియాసలు అయ్యాయి.